Sonia Gandhi: రాజీవ్ రాజకీయ జీవితం దారుణంగా ముగిసింది

Sonia Gandhi: రాజీవ్  రాజకీయ జీవితం దారుణంగా ముగిసింది
25వ రాజీవ్‌గాంధీ నేషనల్ సద్భావన అవార్డు కార్యక్రమంలో సోనియాగాంధీ భావోద్వేగం

దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రాజకీయ జీవించింది తక్కువకాలమే అయినా లెక్కలేనన్ని విజయాలను సాధించారని, అయినప్పటికీ అతని రాజకీయ జీవితం చాలా దారుణంగా ముగిసిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సంద్భంగా ఆదివారం నిర్వహించిన 25వ రాజీవ్‌గాంధీ నేషనల్ సద్భావన అవార్డు కార్యక్రమంలో సోనియా మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ఆయన పాలించింది కొంతకాలమే అయినా లెక్కలేనన్ని విజయాలు సాధించారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

మహిళా సాధికారతకు కృషి చేశారని, నేడు 15 లక్షల మందికిపైగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు గ్రామీణ, పట్టణ సంస్థల్లో పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఉన్నారంటే అది కేవలం రాజీవ్‌గాంధీ కృషి, దూరదృష్టి వల్లనే అన్నారు. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు ఆయనే తగ్గించారని అన్నారు.


ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. విభజన, ద్వేషం, మతోన్మాదం, పక్షపాత రాజకీయాలను ప్రోత్సహించే శక్తులు నేడు అధికారంలో ఉన్నాయని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. శాంతి, మతసామరస్యం, జాతీయ సమైక్యత పెంపునకు కృషి చేసే వ్యక్తులు, సంస్థలకు రాజీవ్‌గాంధీ నేషనల్ సద్భావన అవార్డు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాజస్థాన్ బనస్థలి విద్యాపీఠ్‌కు 2020-21 సంవత్సరానికి 25వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డును ప్రదానం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో సంస్థకు చెందిన సిద్ధార్థ శాస్త్రికి ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు, ఒక ప్రశంసా పత్రం అందజేశారు.

1984లో తన తల్లి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. తన 40 సంవత్సరాల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా నిలిచారు. డిసెంబర్ 2, 1989 వరకు పదవిలో ఉన్నారు. అయితే 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) ఆత్మాహుతి దాడిలో హత్యకు గురయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story