CEC Rajiv Kumar: రిటైర్మెంట్‌ తర్వాత హిమాలయాలకు.. సీఈసీ రాజీవ్‌ కుమార్‌

CEC Rajiv Kumar: రిటైర్మెంట్‌ తర్వాత హిమాలయాలకు.. సీఈసీ రాజీవ్‌ కుమార్‌
X
ఏకాంతం, స్వీయ అధ్యయనం కోసం కొంత సమయం కావాలన్న సీఈసీ

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. మంగళవారం చివరి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలే ఆయన చివరి ప్రెస్‌మీట్ కావడం విశేషం. మే 15, 2022న 25వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు.

ఇదిలా ఉంటే రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారో రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పదవీ విరమణ తర్వాత హిమాలయాల్లో అనేక నెలల పాటు ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు కొంత ఏకాంతం, స్వీయ అధ్యయనం అవసరం అని తెలిపారు. రాజీవ్ కుమార్.. బీహార్/జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1984-బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పేద పిల్లలకు బోధించడం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలనే వ్యక్తిగత కోరిక ఉన్నట్లు తెలిపారు. మునిసిపల్ పాఠశాలలో విద్యాభాస్యాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చెట్టు కింద తరగతులు జరిగినట్లుగా గుర్తుచేశారు. 6వ తరగతిలో ఏబీసీడీలు నేర్చుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపారు. స్లేట్‌ తీసుకుని చెట్టుకింద కూర్చున్నట్లు చెప్పారు. తిరిగి మూలాల్లోకి వెళ్లి పిల్లలకు పాఠాలు నేర్పించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

రాజీవ్ పదవీ కాలంలో 2022లో 16వ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఒక మైలురాయి. ఇక ఎన్నికల కమిషనర్‌గా రాకముందు ఫైనాన్స్ సెక్రటరీ మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఛైర్మన్‌తో సహా అనేక కీలక పదవులు నిర్వహించారు. ఆర్థిక కార్యదర్శిగా బ్యాంకుల విలీనాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనీకరణ మరియు షెల్ కంపెనీలపై అణిచివేత వంటి ముఖ్యమైన సంస్కరణలకు నాయకత్వం వహించారు.

Tags

Next Story