Rajya Sabha : పోస్టాఫీస్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Rajya Sabha : పోస్టాఫీస్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యాయవాదుల బిల్లు ఆమోదం, తెలంగాణ గిరిజన యూనివర్శిటీ బిల్లు

పోస్టాఫీస్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 125 ఏళ్ల నాటి ఈ చట్టాన్ని సవరించడం వల్ల ప్రభుత్వానికి కీలక అధికారాలు లభించనున్నాయి. దేశ భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలు, శాంతి భద్రతలు, అత్యవసర పరిస్థితులు లేదా ప్రజా భద్రత వంటి సందర్భాల్లో ఏదైనా వస్తువు లేదా కవరును తెరచి చూసి, స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు లభిస్తుంది. దీని కోసం ఏదైనా అధికారికి అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వొచ్చు. దేశంలోని తపాలా కార్యాలయానికి సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేయడం, సవరించడం, దానితో అనుసంధానించడమే ఈ బిల్లు లక్ష్యమని, దేశ భద్రత కోసమే ఈ నిబంధనలను ఏర్పాటు చేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా, ఈ బిల్లును వామపక్షాలు, ఆమ్ ఆద్మీపార్టీ, టీడీపీ, ఏఐఏడీఎంకే, ఎన్ సీపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్సిళ్లను తెరిచి చూసే అధికారాన్ని పోస్టల్ అధికారికి కట్టబెట్టడం వలన వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘనకు గురువుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


మరోవైపు లోక్‌సభ న్యాయవాద వృత్తిని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభలో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ప్రవేశపెట్టారు. న్యాయవాద వృత్తిని ఒకే చట్టం ద్వారా క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కోర్టుల్లో న్యాయవాదులు-కక్షిదారుల మధ్య దళారులను తొలగించాలని పార్టీలకు అతీతంగా ఎంపీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు గిరిజన యూనివర్శిటీని రూ.889.07 కోట్లతో రెండు దశల్లో ఏడేళ్లలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఈ యూనివర్శిటీ ఉన్నత విద్య నాణ్యతను పెంచుతుందని తెలిపారు. తెలంగాణలోని సమ్మక్క సారక్క సెంట్రల్‌ గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు సంబంధించిన సెంట్రల్‌ యూనివర్శిటీ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రవేశపెట్టారు. వరంగల్‌ జిల్లా ములుగులో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నారు.


ఆప్‌ ఎంపీ రాఘవ చద్దాపై విధించిన సస్పెన్షన్‌ను రాజ్యసభ ఎత్తివేసింది. సస్పెన్షన్‌ ఎత్తివేత తీర్మానాన్ని సోమవారం ఆమోదించింది. ఓ తీర్మానంపై తోటి సభ్యుల అనుమతి లేకుండానే సంతకాలు చేశారన్న ఆరోపణలపై రాఘవ చద్దాను గత ఆగస్టులో సభ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags

Next Story