రాజ్యసభలో రగడ సృష్టించిన ఎంపీలపై చర్యలకు రంగం సిద్ధం

రాజ్యసభలో రగడ సృష్టించిన ఎంపీలపై చర్యలకు రంగం సిద్ధం అవుతోంది. నిన్న వ్యవసాయ బిల్లులపై చర్చ, ఓటింగ్ సందర్భంగా కొందరు సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. డిప్యూటీ ఛైర్మన్ మైక్ లాగి, పేపర్లు విసిరడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తృణముల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌తోపాటు కొందరు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్యే బిల్లులు పాస్ అయ్యాయి. ఐతే.. ఆ సమయంలో సభలో చోటుచేసుకున్న పరిణామాల్ని అధికారపక్షం సీరియస్‌గా తీసుకుంది. రూల్ 256 ప్రకారం సభ్యుల సస్పెన్షన్ కోరుతూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. వీడియో ఫుటేజ్ పరిశీలించాక బాధ్యులైన ఎంపీలపై చర్యలు తీసుకోనున్నారు.
రాజ్యసభలో విపక్ష సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. నిన్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నివాసంలో జరిగిన సమావేశంలో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించారు. అటు, డిప్యూటీ ఛైర్మన్‌పై 12 విపక్ష పార్టీలు అవిశ్వాస నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అది కూడా ప్రస్తావనకు వచ్చింది. వ్యవసాయ బిల్లుల విషయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఇవాళ్టి సభ పరిణామాల్లో దీనిపై ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com