Rajya Sabha: రాజ్యసభలో 12 సీట్లకు ఉపఎన్నిక.. షెడ్యూల్ విడుదల

భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 14న నామినేషన్ ప్రక్రియ మొదలై ఆగస్టు 21 వరకు ఉంటుంది. బీహార్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 27, అదే అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఈ నెల 26. పోలింగ్ సెప్టెంబర్ 3న ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 4 గం.ల వరకు జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
మొత్తం 12 సీట్లలో.. అస్సాం, బీహార్, మహారాష్ట్ర నుండి రెండు, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఒడిశా నుండి ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా.. తదితరులు లోక్‌సభకు ఎన్నికవడంతో పది స్థానాలు ఖాళీ కాగా, తెలంగాణలో కే. కేశవరావు ఇటీవల తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయగా, ఒడిశాలో మమతా మోహంతా రాజీనామా చేయడంతో రెండు స్థానాల్లో ఖాళీ ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com