Ayodhya Ram Temple: అయోధ్యలో నేటి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు

Ayodhya Ram Temple: అయోధ్యలో నేటి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు
ప్రారంభమైన క్రతువులు, ఆచారాలు

అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు, ఆచారాలు ఇవాళ్టి నుంచే ఆరంభం కానున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఇవాళ పరిహార క్రతువును నిర్వహిస్తుంది. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ, గో సమర్పణ మొదలగు కార్యక్రమాలు ఇవాళ జరగనున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. జనవరి 22 మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగుతుంది. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఈ ముహూర్తం నిర్ణయించారు. రామ విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల వరకు ఉండనుంది. 121 మంది ఆచార్యులు.. ఈ క్రతువు నిర్వహిస్తారని రామజన్మభూమి కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా ఉంటారని తెలిపారు. 150కిపైగా సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు.. ఈ కార్యక్రమానికి విచ్ఛేస్తారని చెప్పారు. ఈ నెల 23 నుంచి భక్తులంతా రాములవారిని దర్శించుకోవచ్చని పేర్కొన్నారు.

హిందువులంతా ఎంతో భక్తి భావంతో ఎంతో ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీ రాముని ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతుంది. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా రామ మందిర ప్రారంభోత్సవం జరగాలని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 22వ తేదీన జరగనున్న ఈ మహా క్రతువులో దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఆచారాలు, నియమాలు మకర సంక్రాంతి పండుగ నుండి, అంటే నేటి నుండే ప్రారంభమయ్యాయి. అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనే 11 మంది పుణ్య దంపతులు నేటి నుండి 45 నియమాలను పాటించనున్నారు. నేడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ దంపతులు అందరూ మొదటి స్నానం చేసి ఎనిమిది రోజులపాటు ఈ నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలలో పాల్గొనే 11 మంది దంపతులకు పాటించవలసిన నియమాలను తెలియజేసింది. వీరంతా ఈ ఎనిమిది రోజులపాటు అత్యంత నిష్ఠతో శ్రీరామునికి పూజలు చేయాలి. నిరంతరం రామనామ జపం చేయాలి. సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ సాత్వికమైన జీవనశైలి ఉండేలా చూసుకోవాలి. ఇదిలా ఉంటే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి, శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట ఆహ్వానాలను ఇప్పటికే దేశ విదేశాలలోని ప్రముఖులకు అందజేశారు. అయితే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాలను 56 దేశాలలో ఇస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్ నేత అలోక్ కుమార్ వెల్లడించారు. 56 దేశాలలో మొత్తం పది కోట్ల మందికి ఆహ్వానాలు అందించాలని తాము ప్లాన్ చేసుకున్నట్టు ఆయన తెలిపారు.


Tags

Next Story