Ram Mandir Ayodhya: వేగంగా జరుగుతున్న అయోధ్య రామమందిర నిర్మాణం.. ఎప్పటివరకు పూర్తవుతుంది అంటే.?

Ram Mandir Ayodhya: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. 2023 డిసెంబర్‌లోగా ఆలయ నిర్మాణం పూర్తవుతుందంటున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. సుల్తాన్‌పుర్‌లో రక్షా బంధన్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొద్దిరోజుల్లోనే పెద్ద ఆలయంలో రామ్ లల్లాను దర్శించుకోవచ్చని స్పష్టం చేశారు. అయోధ్యకు సుల్తాన్‌పుర్ సమీపంలోనే ఉన్నందున.. వచ్చే ఏడాది డిసెంబర్లో శ్రీరామ్ లల్లాను దర్శించుకోవాలని ఆహ్వానం పలుకుతున్నాట్లు సుల్తాన్‌పుర్ ప్రజలకు చెప్పారు రాయ్. ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందన్నారాయన. ఆలయ నిర్మాణంలో ఇనుము వాడట్లేదని.. అయితే ఆలయ డిజైన్ చూసి ప్రజలు ఆశ్చర్యపోతారన్నారు.
రామ మందిరం నిర్మాణ పనుల్ని చూసుకునేందుకు.. కేంద్రం శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను నియమించింది. వచ్చే ఏడాది చివరి నాటికి గుడిని పూర్తి చేయాలని ట్రస్ట్ గడువు పెట్టుకుంది. గర్బగుడి ప్రాంతం నుంచి ప్రధాన ఆలయ నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభంచారు. ఆలయ గోడలకు పింక్ రాళ్లను రాజస్థాన్ నుంచి తరలిస్తున్నారు. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది.
మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులుగా ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ.. వేద మంత్రాల మధ్య ఆలయానికి పునాది రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి వచ్చే ఏడాది డిసెంబర్ లోగా మందిర నిర్మాణం పూర్తి చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com