Ayodhya: జనవరిలో జైశ్రీరామ్

Ayodhya: జనవరిలో జైశ్రీరామ్
X
జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభం

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి శుభముహూర్తం ఖరారైంది. అయోధ్య రామాలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టను సంక్రాంతి పండుగ తర్వాత 21, 22, 23 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఈ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ప్రముఖ సాధువులు, ఇతర అతిథులతో పాటు రావాలనే ఉద్దేశం ఉన్న ఇతర రాజకీయపార్టీల నేతలను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రత్యేక వేడుక జరుగుతుందన్నారు. రామాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో వేదిక కానీ బహిరంగసభ కానీ ఉండదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని, వివిధ రాజకీయ పార్టీల నుండి అతిథులను ఆహ్వానిస్తామని చెప్పారు. 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేలమంది మతపెద్దలను ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ తెలిపింది. 25,000 మంది సాధువులు, 10,000 మంది ప్రత్యేక అతిథులు విడివిడిగా ఉంటారని చెప్పారు. వీరంతా రామజన్మభూమి ప్రాంగణంలోని పవిత్రోత్సవానికి హాజరవుతారు. అలాంటి సాధువుల జాబితాను ట్రస్ట్ సిద్ధం చేస్తోందని, త్వరలో వారికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ సంతకంతో ఆహ్వాన పత్రాన్ని పంపించనున్నట్లు చెప్పారు.


అయోధ్యలో బ్రహ్మాండమైన రామమందిరాన్ని నాగార శైలిలో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు దాదాపు 161 అడుగులు. ఆలయంలో 167 స్తంభాలను ప్రతిష్ఠించనున్నారు. సరయూ ప్రవాహాన్ని ఆపడానికి ఆలయం చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఆలయ ప్రాంగణంలోనే పార్కును నిర్మిస్తున్నారు. వీటితో పాటు శ్రీరాముడి జీవితం ఆధారంగా సాగే ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గుడిలోని మండపం ద్వారాలు మక్రానా పాలరాతితో చేశారు. వీటికి అమర్చే తలుపులను దేశంలోనే అత్యంత నాణ్యమైన టేకు కర్రతో తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా బల్హార్షా నుంచి టేకు కర్రతో తలుపులు చేయనున్నారు. ఇక్కడి నుంచి భక్తులు రాముడిని దర్శించుకుంటారు. ప్రస్తుతం గర్భగుడిలో పాలరాతిని అమర్చే పనులు జరుగుతున్నాయి. ఈ గర్భగుడికి బంగారు తలుపులను ఏర్పాటు చేయనున్నారు. 9 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఈ తలుపులు ఉండబోతున్నాయి. రామాలయంలో రెండు ప్రదక్షిణ మార్గాలు నిర్మిస్తున్నారు. వీటిలో గర్భగుడి ఒక ప్రదక్షిణ మార్గం తయారువుతోంది. అర్చకులు మాత్రమే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయగలరు.

Tags

Next Story