Ayodhya: అయోధ్య రామ మందిరం గర్భగుడి ఇలా ఉండనుంది

Ayodhya:  అయోధ్య రామ మందిరం గర్భగుడి ఇలా ఉండనుంది
ఫొటోలను విడుదల చేసిన తీర్థ క్షేత్ర ట్రస్టు

అయోధ్య రామమందిరం ఇంకో నెలరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఆలయ గర్భ గుడి ఫోటోలను....సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా పంచుకున్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నుంచి రామభక్తులు ఈ ఆధ్యాత్మిక క్రతువులో పాల్గొనేందుకు వీలుగా....ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని సాధువులు డిమాండ్‌ చేస్తున్నారు. వారం రోజులపాటు సాగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా 130 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు.


ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు నడయాడిన నేల అయోధ్య. తేత్రాయుగం కాలానికి చెందిన ఈ నగరంలో రామ మందిరం పునః నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది హిందువుల కల సాకారం కాబోతున్నది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయం ప్రారంభోత్సవ వేడుక జరుగనున్నది. ఈ క్రమంలో ఆలయ గర్భగుడి ఫోటులను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ విడుదల చేశారు. సోషల్‌ మీడియా సైట్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా విడుదల చేయగా.. వైరల్‌ అయ్యాయి.


రామ్ లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. రాముడి విగ్రహాన్ని తయారు చేసుకునేందుకు కర్ణాటక, రాజస్థాన్‌ల నుంచి తీసుకొచ్చిన శిలలతో 3 విగ్రహాలను తయారు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సర్కార్ జనవరి 2024 లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనున్నారు. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ తయారు చేసింది. 7 ధ్వజ స్తంభాల బరువు సుమారు 5500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది.


శ్రీరామచంద్రమూర్తి ఆలయ మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయ గర్భగుడి సైతం దాదాపు సిద్ధమైందని. ఇటీవల లైటింగ్‌ పనులు సైతం పూర్తయినట్లు చంపత్‌రాయ్‌ పేర్కొన్నారు. మరో వైపు జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జనవరి 16 నుంచి ఈ క్రతువు చేపట్టనున్నారు. జనవరి 22న మూల విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. అంతేకాదు, 130 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

Tags

Read MoreRead Less
Next Story