AYODHYA: అడుగడుగునా రామ స్మరణే

లోకంలోని పండుగ అంతా ఇక్కడే ఉందా అన్నట్లుగా అయోధ్య మారిపోయింది. నగరం అంతటా రంగులహంగుల రంగవల్లికలు, రాముడి చిత్రపటాలు, వర్ణమయ పతాకాలు, మంగళ తోరణాలు, విద్యుద్దీపాలు, పుష్పమాలికల అలంకరణలు, చాందినీలతో కూడిన చలువపందిళ్లతో అయోధ్య అంతా ఓ రమ్యమోహన నగరంగా ఆకృతి దాల్చింది. సృష్టిలోని సౌందర్యం అంతా అయోధ్యలోనే ఉందా అనిపిస్తూ దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది అయోధ్యాపురి. అయోధ్య ఆలయ ప్రాంగణంలో పురాతన వస్తు ప్రదర్శనశాల ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది. మందిర విశేషాలతో సహా, తవ్వకాల్లో బయటపడిన విగ్రహాల్ని, వస్తువుల్ని, త్రేతాయుగం నాటి అనేక కళాకృతుల్ని, నమూనాల్ని ఇక్కడ ప్రదర్శించనున్నారు. రామాలయాన్ని మూడో అంతస్తుకు విస్తరించాలని నిర్ణయించడంతో, ఆలయం ఎత్తు 33 అడుగులకు పెరిగింది. 5 ప్రవేశద్వారాలు, 5 గుమ్మటాలను ప్రత్యేకంగా నిర్మింపజేశారు. 5 గుమ్మటాలు ఉండే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. మండపాల్లో కనీసం 5 వేల నుంచి 8వేల మంది భక్తులు వేచి ఉండేలా కాంప్లెక్స్ లు సైతం రూపుదిద్దుకోనున్నాయి. భవిష్యత్తులో భక్తులరద్దీ పెరిగినా, తట్టుకునేలా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అనేక ఏర్పాట్లకు ముందస్తుగానే ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేశారు.
..అయోధ్యలో భక్తులు దర్శించాల్సిన ముఖ్యప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సీతారాముల వివాహం తర్వాత అయోధ్యలో ప్రవేశించాక, కైకేయీ, దశరథులు సీతారాములకు కనక్ మహల్ని కానుకగా ఇచ్చారని విశ్వసిస్తారు. ఈ భవనాన్ని ఆ తర్వాత విక్రమాదిత్యుడు పునర్నిర్మించాడని ప్రతీతి. పట్టాభిషేకం తర్వాత శ్రీరాముడు తనకు సాయంచేసిన వారందరికీ కానుకలు సమర్పించాడు. తనకు అత్యధికంగా సహకరించి, సేవించిన హనుమంతునికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసయోగ్య స్థలాన్ని శ్రీరాముడు ఇచ్చాడంటారు. అక్కడే హనుమంతుడికి ఆలయ నిర్మాణం జరిగింది. పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఆలయానికి 90 మెట్లు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంది.
అయోధ్యా రాముడి ఆలయ ఆవరణలో భారీ యాగశాలను నిర్మించనున్నారు. ఈ ఆలయానికి అనుసంధానంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ను సైతం ఏర్పాటు చేయనున్నారు. అనేక ఆధ్యాత్మిక పరిశోధనలకు ఇది కేంద్రంగా నిలవనుంది. అలాగే భారీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో అతి సుందరమైన నీటి కొలను నిర్మిస్తారు. దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తుల ఆకలి తీర్చేలా అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారీస్థాయిలో నిర్మించనున్న కొలనులో ప్రత్యేకంగా సౌండ్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com