Kerala: హత్యాచార ఖైదీ జైలు గోడ దూకి పరారీ

Kerala: హత్యాచార ఖైదీ జైలు గోడ దూకి పరారీ
X
కేరళలో షాకింగ్ ఘటన..

కేరళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య కేసులో జీవితఖైదీ అనుభవిస్తున్న ఖైదీ నిఘా కళ్లు గప్పి చాకచక్యంగా తప్పించుకున్నాడు. 25 అడుగుల ఎత్తున్న జైలు గోడ దూకి పారిపోయాడు. ఆశ్చర్యమేంటంటే ఖైదీ వికలాంగుడు కావడం విశేషం. ఒక చేయి లేదు. అయినా కూడా గోడ దూకి పారిపోవడం అధికారుల్ని కలవరపాటుకు గురిచేసింది.

2011 సౌమ్య అత్యాచారం, హత్య కేసులో గోవిందచామి దోషిగా తేలాడు. ప్రస్తుతం కన్నూర్ సెంట్రల్ జైల్లో జీవితఖైదీ అనుభవిస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం అధికారులు తనిఖీ చేస్తుండగా గోవిందచామి తప్పించుకున్నట్లు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసినట్లుగా డీజీపీ తెలిపారు. గోవిందచామిని అదుపులోకి తీసుకున్నామని, తప్పించుకోవడానికి దారితీసిన లోపాలపై చర్యలు తీసుకుంటామని జైలు డీజీపీ బలరామ్ కుమార్ ఉపాధ్యాయ్ తెలిపారు.

నిందితుడు కన్నూర్ నగర పరిధిలోని థాలప్‌లోని ఒక శిథిలావస్థలో ఉన్న భవనం దగ్గర బావిలో దాక్కున్నప్పుడు పట్టుబట్టాడు. దోషికి ఎడమ చేయి లేదు. తెల్లవారుజామున సాధారణ తనిఖీలు చేస్తున్నప్పుడు సంఘటన వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు వెంటనే జైలు ఆవరణలో, చుట్టుపక్కల సోదాలు చేశారు. కానీ ఖైదీ ఎక్కడా కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజీలో జైలు నుంచి తప్పించుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. వెంటనే డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా దొరికిపోయాడు.

మంజక్కాడ్‌కు చెందిన 23 ఏళ్ల సౌమ్య అనే మహిళ ఫిబ్రవరి 1, 2011న ఎర్నాకుళం నుంచి షోర్నూర్‌కు ప్యాసింజర్ రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తుండగా గోవిందచామి అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన త్రిస్సూర్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2012లో నిందితుడు గోవిందచామికి మరణశిక్ష విధించింది. 2014లో కేరళ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. 2016లో ఈ కేసుపై దర్యాప్తు చేసిన సుప్రీంకోర్టు నిందితుడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. నాటి నుంచి అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

నిందితుడు జైలు నుంచి తప్పించుకోవడం పట్ల సౌమ్య తల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అధికారుల సహకారంతోనే తప్పించుకున్నట్లు ఆరోపించింది. కన్నూర్ జైలు చాలా పెద్దది.. అలాంటి జైలు నుంచి ఎలా తప్పించుకోగలుగుతారని ప్రశ్నించింది. ఎవరో సహాయంతోనే తప్పించుకున్నట్లు పేర్కొంది. వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేసింది.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ జైలు వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ‘‘అయితే నిందితుడు తెల్లవారుజామున 1 గంటలకు పారిపోయాడు. జైలు అధికారులకు ఉదయం 5 గంటలకు విషయం తెలిసింది. పోలీసులకు ఉదయం 7 గంటలకు సమాచారం అందింది. గోడపై విద్యుత్ కంచె ఉంది. అతను జైలు నుంచి తప్పించుకునేటప్పుడు విద్యుత్ ఆపివేయబడింది. అంతా మిస్టరీ. అతను తప్పించుకున్నాడా లేదా పారిపోవడానికి సహాయం చేశారా?” అని ఆయన ప్రశ్నించారు.

Tags

Next Story