Jai Shah: పాక్ దాడిలో ఆఫ్ఘన్ క్రికెటర్ల మృతి... బీసీసీఐ సంతాపం, అనాగరికం.. అనైతికమన్న రషీద్ ఖాన్

Jai Shah: పాక్ దాడిలో ఆఫ్ఘన్ క్రికెటర్ల మృతి... బీసీసీఐ సంతాపం, అనాగరికం.. అనైతికమన్న రషీద్ ఖాన్
X
ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులు

ఆఫ్ఘనిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కబీర్ అఘా, సిబ్ఘతుల్లా, హరూన్ అనే ఈ యువ క్రీడాకారుల మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

ఈ దారుణ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "ఈ కష్టకాలంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ), క్రీడాకారుల కుటుంబాలకు బీసీసీఐ అండగా నిలుస్తుంది. అమాయకులైన క్రీడాకారులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం అత్యంత బాధాకరం" అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు పెట్టుకోకూడదనే తమ పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది.

మరోవైపు ఐసీసీ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఒక స్నేహపూర్వక మ్యాచ్ ఆడి ఇంటికి తిరిగి వెళుతున్న ముగ్గురు యువ ప్రతిభావంతులను పొట్టనపెట్టుకోవడం దారుణమని పేర్కొంది. వారి కుటుంబాలకు, ఆఫ్ఘన్ క్రికెట్ సమాజానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.

ట్రై సిరీస్ నుంచి తప్పుకున్న ఆఫ్ఘనిస్థాన్

ఈ పిరికిపంద దాడికి నిరసనగా ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో పాకిస్థాన్, శ్రీలంకతో కలిసి ఆడాల్సిన ట్రై-నేషన్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. నవంబర్ 5 నుంచి 29 వరకు లాహోర్, రావల్పిండి వేదికగా ఈ సిరీస్ జరగాల్సి ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం జరిపిన ఈ దాడిని ఏసీబీ తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ఆఫ్ఘనిస్థాన్ క్రీడా రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది: జై షా

ఈ ఘటనపై ఐసీసీ చైర్మన్ జై షా కూడా స్పందించారు. తన స్పందనను సోషల్ మీడియా ద్వారా వెలిబుచ్చారు. దేశం కోసం ఆడాలనే తపనతో, కళ్ల నిండా కలలతో మైదానంలో అడుగుపెట్టిన ఆ యువకుల భవిష్యత్తు ఇలా హింసకు బలికావడం అత్యంత దారుణం. ఇది కేవలం అఫ్ఘానిస్తాన్ క్రికెట్ కు మాత్రమే కాదు, యావత్ క్రీడా ప్రపంచానికి తీరని నష్టం. ఎంతో భవిష్యత్తు ఉన్న వర్ధమాన క్రీడాకారులను ఇలా అర్థాంతరంగా కోల్పోవడం జీర్ణించుకోలేని విషయం. వారి ప్రతిభ ఇకపై మైదానంలో కనిపించదనే వాస్తవం గుండెను పిండేస్తోంది.

ఈ అత్యంత బాధాకరమైన సమయంలో, నేను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాదం నుంచి వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కష్టకాలంలో క్రీడా ప్రపంచమంతా వారికి అండగా నిలబడాలి" అని పేర్కొన్నారు.

ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఇక పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య అనాగరికం, అనైతికం అంటూ ధ్వజమెత్తారు.

Tags

Next Story