Ratan Tata: ముంబై వర్లీ శ్మశానవాటికలో రతన్ టాటా అంత్యక్రియలు
పారిశ్రామిక దిగ్గజం, దాతృశీలి రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. వొర్లిలోని శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ముందుగా ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శణార్థం ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై రతన్ టాటాకు నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనల అనంతరం శ్మశానవాటికకు ఆయన పార్థివదేహాన్ని తరలించారు. రతన్ టాటా అంత్యక్రియల్లో కేంద్రమంత్రులు అమిత్ షా, పీయూశ్ గోయల్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే, టాటా కుటుంబసభ్యులు, టాటా గ్రూప్ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ దహనవాటికలో
రతన్ టాటా పార్శీ మతస్థుడు. సాధారణంగా పార్శీ మతానికి చెందిన వారు మృతదేహాలను ఖననం, దహనం చేయరు. నీరు, గాలి, భూమిని పార్శీలు పవిత్రంగా చూస్తారు. మృతదేహాలను ఖననం, దహనం చేయడం ద్వారా ఇవి కలుషితం అవుతాయని భావిస్తారు. అందుకే, రాబందులు, డేగలు వంటి పక్షులు తినేందుకు వీలుగా మృతదేహాన్ని దఖ్మా అని పిలిచే ప్రదేశంలో వదిలిపెడతారు. మరణించినా పక్షులకు ఆహారంగా మారాలనే ఆలోచనతో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. అయితే పర్యావరణ మార్పులు, రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో విద్యుత్ దహన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. టాటా అంత్యక్రియలు కూడా ఎలక్ట్రిక్ విధానంలోనే పూర్తయ్యాయి.
పార్సీ విధానం ఇలా..
వాస్తవానికి వీరి పద్దతి ప్రకారం అంత్యక్రియల్లో 6 దశలు ఉంటాయి. ఇందులో భాగంగా ముందుగా భౌతికకాయాన్ని నీటితో శుబ్రం చేస్తారు. తర్వాత తెల్లని వస్త్రాలు ధరింపచేస్తారు. దుష్టశక్తులు దాడిచేయకుండా ప్రార్థనలు చేస్తారు. ఆ సమయంలో ప్రేతాత్మలను ఎదుర్కోవడానికని ఓ శునకాన్ని తీసుకొచ్చి భౌతికకాయం పక్కన ఉంచుతారు. రెండో దశలో.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందర్శన కోసం ఉంచుతారు. వారు.. అతడు చేసిన తప్పులేమైనా ఉంటే క్షమించాలని కోరతారు. మూడోదశలో ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఊరేగింపుగా తీసుకెళ్తారు. నాలుగో దశలో… జోరాస్ట్రియన్ సంప్రదాయం ప్రకారం టవర్ ఆఫ్ సైలెన్స్ కి తీసుకెళ్లి.. అక్కడ ఏకాంత ప్రదేశంలో మృతదేహాన్ని ఉంచుతారు. ఆ సమయంలో మృతదేహాన్ని డేగలు, రాబందులు ఆరగిస్తాయి. ఐదవ దశలో మూడు రోజుల పాటు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ మూడు రోజుల్లోనూ శరీరం నుంచి ఆత్మ వేరుపడుతుందని ఫార్సీల నమ్మకం. ఇక చివరి దశలో… ఆ వ్యక్తి మరణించిన నాలుగో రోజు, పదో రోజు, పదమూడో రోజు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com