UPI Charges : యూపీఐ ఛార్జీలపై ఆర్బీఐ కీలక ప్రకటన..

UPI Charges : యూపీఐ ఛార్జీలపై ఆర్బీఐ కీలక ప్రకటన..
UPI Charges : యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశం లేదని స్పష్టతనిచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ.

UPI Charges : యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశం లేదని స్పష్టతనిచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. UPI ప్రజలకు ఉపయోగపడే డిజిటల్ వ్యవస్థ అని...దీంతో ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకత కూడా పెరిగిందని అభిప్రాయపడింది. యూపీఐ సేవలపై ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. సర్వీస్ ప్రొవైడర్స్‌ తమకు అయ్యే ఖర్చును ఇతర మార్గాల ద్వారా భర్తీ చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం గతేడాది డిజిటల్ పేమెంట్‌ ఎకోసిస్టమ్‌కు అండగా నిలిచేందుకు ఆర్థికసాయం అందించింది. డిజిటల్ చెల్లింపులను మరింత మంది తీసుకునేలా వినియోగదారులకు అనువైన చెల్లింపు వేదికలను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ ఏడాది కూడా అదే సాయాన్ని కొనసాగిస్తున్నట్లు ఆర్థికశాఖ ప్రకటించింది.

సాధారణంగా క్రెడిట్‌ కార్డు లావాదేవీలు నిర్వహించినప్పుడు మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు ఛార్జీలను విధిస్తుంటారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు పంచుకుంటాయి. ఇదే విధంగా యూపీఐ లావాదేవీలపైనా ఎండీఆర్‌ తరహా ఛార్జీలను విధిస్తే, సంబంధిత సంస్థలు మరింత సమర్థంగా సేవలను అందిస్తాయని RBI భావిస్తోంది. ఎండీఆర్‌ తరహాలోనే లావాదేవీ మొత్తంపై నిర్ణీత శాతాన్ని రుసుముగా వసూలు చేయాలా? లేదా లావాదేవీకి స్థిరంగా కొంత మొత్తం వసూలు చేయాలా అనే విషయంపై ప్రజాభిప్రాయం కోరుతూ 'చెల్లింపుల వ్యవస్థల్లో ఛార్జీలు' అనే చర్చా పత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది రిజర్వు బ్యాంకు. దీనిపై అక్టోబరు 3 లోపు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరింది. ఇమ్మీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌, నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌, రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ తోపాటు, డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డు, ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ తదితరాలకూ ఛార్జీల ప్రతిపాదనను చేసింది. విధివిధానాలు, నిబంధనలు, ఇతర అంశాలపైనా సూచనలివ్వాలని కోరింది RBI.

UPI ఆధారిత చెల్లింపులు ప్రస్తుతం రోజుకు 21 కోట్లకు పైగా జరుగుతున్నట్లు అంచనా. NPCI జులై గణాంకాలను పరిశీలిస్తే..మొత్తం 338 బ్యాంకులు UPI లావాదేవీల్లో పాలుపంచుకున్నాయి. 628 కోట్ల 80 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ పది లక్షల 62 వేల 991 కోట్లుగా ఉంది. 2020-21 మధ్య 2 వేల 228 కోట్ల లావాదేవీలు జరగగా...వీటి విలువ 41 లక్షల 3 కోట్లుగా ఉంది.

UPI ప్రధాన లక్ష్యం నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం. యూపీఐ లావాదేవీల్లో 50 శాతం వరకు 200 రూపాయల లోపు మొత్తానివే ఉంటున్నాయి. టీ తాగి పది చెల్లించాలన్న...డిజిటల్‌ చెల్లింపులే చేస్తున్నారు. పర్సన్‌ టు పర్సన్‌...పర్సన్‌ టూ బిజినెస్‌ మెన్‌ నగదు బదిలీకి ఎన్నో యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో యూపీఐ సేవలపై ఛార్జీలు, జీఎస్టీ విధిస్తే వినియోగదారులు మళ్లీ నగదు చెలామణికి మొగ్గు చూపుతారని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. దీంతో యూపీఐ సేవలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story