బ్యాంకుల వద్ద సరిపడ చిల్లర ఉంది మార్చుకోండి: RBI గవర్నర్

చలామణి నుంచి ఉపసంహరిస్తున్న రెండు వేల నోట్లను నేటి నుంచి బ్యాంకులో జమ చేసుకుని వేరే నోట్లను తీసుకొవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం బ్యాంకుల వద్ద తగిన మేర నగదు అందుబాటులో ఉన్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30 వరకు అవకాశం ఇచ్చినా, వాటి చెల్లుబాటు అప్పటివరకే పరిమితం అని తాము చెప్పడం లేదన్నారు. ఆలోపు మార్చుకోవడానికి అందరూ ప్రయత్నించాలని సూచించారు.
నగదు నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే వీటిని ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రక్రియను అంతులేని కథలా వదిలిపెట్టకూడదన్న ఉద్దేశంతోనే సెప్టెంబరు 30వరకు గడువు విధించామని, ఆ తర్వాత ఏం చేయాలన్నది.. అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు వెయ్యి రూపాయల నోటును పునఃప్రవేశపెట్టే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని స్పష్టంచేశారు.
ఇదిలా ఉండగా 2వేల రూపాయల నోట్ల వ్యవహారంపై ఆర్బీఐకి లేఖ రాశారు పెట్రోలియం డీలర్లు. పెట్రోల్ బంక్‌లకు 2వేల రూపాయల నోట్లు వరదలా వచ్చి పడుతున్నాయని లేఖలో తెలిపారు. చాలా మంది కస్టమర్లు రెండు వేల రూపాయల నోటు ఇవ్వడంతో చిల్లర ఇవ్వడం తమకు ఇబ్బందిగా మారుతోందన్నారు. తమకు తగినంతగా చిన్న డినామినేషన్లలో నోట్లు ఇవ్వాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. గతంలో తమకు కస్టమర్లు ఇచ్చే నోట్లలో రెండు వేల రూపాయల నోట్లు కేవలం పది శాతం ఉండేవని, ఇపుడు వస్తున్న నోట్లలో 90 శాతం అవే ఉంటున్నాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com