ఒడిశా ఘోర రైలు ప్రమాదానికి కారణాలు ఇవేనట!

ఒడిశా ఘోర రైలు ప్రమాదానికి కారణాలు ఇవేనట!
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. రైలు ప్రయాణం అంటేనే వణుకు పుట్టేలా చేసింది. సేఫ్ జర్నీ అనే మాటే హాస్యాస్పదం అవుతోంది

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. రైలు ప్రయాణం అంటేనే వణుకు పుట్టేలా చేసింది. సేఫ్ జర్నీ అనే మాటే హాస్యాస్పదం అవుతోంది. ఇంతకీ ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి... సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యం… ఇది పక్కా అంటోంది రైల్వే శాఖ ప్రాధమికంగా ఇప్పటికైతే తేల్చిందన్న అంశంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

ఘోర రైలు ప్రమాద ఘటనకు ముఖ్య కారణం..ప్రధాన లైన్‌లో వెళ్లాల్సిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఆకస్మికంగా లూప్‌లైన్‌లోకి దూసుకెళ్లి గూడ్స్‌ను ఢీకొనడమేనని రైల్వే అధికారులు అంటున్నారు.షాలీమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 130 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణిస్తోంది. అయితే దానికి ముందే బహనగా బజార్‌ స్టేషన్‌ వద్దకు వచ్చిన గూడ్స్‌ రైల్‌ను లూప్‌లైన్‌లో నిలిపి ఉంచారు. దీంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. మెయిన్‌ లైన్‌లో వెళ్లేలా సిగ్నల్‌ ఇచ్చారు. అయితే సడెన్‌గా కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లూప్‌ లైన్‌లోకి దూసుకెళ్లి, అక్కడ ఆగివున్న గూడ్స్‌ను బలంగా ఢీకొంది. దీంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు నుజ్జు కావడంతోపాటు, మొత్తంగా 14 బోగీల్లో కొన్ని బోల్తాపడగా, మరికొన్ని పక్కన ఉన్న మరో మెయిన్‌ లైన్‌ పై పడ్డాయి. అదే సమయంలో స్పీడ్‌గా వస్తున్న యశ్వంత్‌పూర్‌-హౌరా సూపర్‌ఫాస్ట్‌ డౌన్‌ మెయిన్‌ లైన్‌లోకి వచ్చి, ఢీకొంది. దీంతో దాని రెండు బోగీలు కూడా బోల్తాపడ్డాయి. దీనివల్ల భారీగా ప్రాణనష్టం జరిగింది.

అయితే ప్రస్తుతం రైల్వేలో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక వ్యవస్థలో... ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడమనేది జరగనే జరగదని నిపుణులు అంటున్నారు.రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ చాలా పకడ్బందీగా పని చేస్తుందని... ఒకటికంటే ఎక్కువ దశల్లో తప్పిదాలుచేస్తేనే ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడం జరుగుతుందని అంటున్నారు. ఇక కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చునని అంచనా వేశారు. చక్రాలు విఫలం కావడం, విరిగిపోవడం వల్ల రైలు పట్టాలు తప్పే అవకాశముంటుంది.

ఇక రైళ్ల రాకపోకలకు సిగ్నలింగ్‌ వ్యవస్థ కీలకమైనది. ఒక రైలును మెయిన్‌ లైన్‌ నుంచి లూప్‌లైన్‌లోకి పంపిన తర్వాత, ఆ సిగ్నల్‌ పాయింట్లను ఆటోమెటిక్‌గా ఆల్ట్రెక్‌ చేసి,సెట్‌ అగైనెస్ట్‌ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వెంటనే నిమిషాల వ్యవధిలో ఆ పాయింట్లను మెయిన్‌ లైన్‌కు పెట్టి, దానిమీదుగా మరో రైలు వెళ్లేందుకు సిగ్నల్‌ ఇస్తారు. ఇందులో ఏదైనా లోపం జరగడం వల్ల మెయిన్‌ లైన్‌లో వెళ్లాల్సిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, లూప్‌లైన్‌లోకి వెళ్లిఉంటుందని అంచనా వేస్తున్నారు.అప్‌, డౌన్‌ మెయిన్‌ లైన్లలో కోరమండల్‌, యశ్వంత్‌పూర్‌-హౌరా సూపర్‌ ఫాస్ట్‌లకు

స్టేషన్‌ మాస్టర్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్యానెల్‌ రూట్‌ చూపిస్తున్నట్లుగా అధికారుల నివేదికలో తెలిపారు.ఈ ప్రమాద ఘటనతో అక్కడి పాయింట్‌-16బి, 17ఎ, 17బితోపాటు, లొకేషన్‌ బాక్స్‌-3, పాయింట్‌ ట్రాక్‌ జంక్షన్‌ బాక్స్‌లు, సిగ్నల్‌ పోస్టు పూర్తిగా ధ్వంసమైయ్యాయి.

మరోవైపు స్టేషన్‌ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను ఈజీగా మార్చేందుకు ఈ లూప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ఈ లూప్‌లైన్ల పొడవు 750 మీటర్లు ఉంటుంది. మల్టిపుల్‌ ఇంజిన్లు ఉండే ఒక గూడ్స్‌ రైలు ఆగేందుకు వీలుగా వీటిని నిర్మిస్తారు. సాధారణంగా.. సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లకు లూప్‌లైన్‌లోకి వెళ్లేందుకు సిగ్నల్‌ ఇచ్చేప్పుడు..హైస్పీడ్‌లో వెళ్లే విధంగా బ్లూసిగ్నల్‌ కాకుండా నెమ్మదిగా వెళ్లే విధంగా సిగ్నల్‌ ఇస్తారు. అయితే, ఇక్కడ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌లైన్లోకి వెళ్లేందుకు సిగ్నల్‌ ఇచ్చినా లూప్‌లైన్‌లోకి ఎలా వచ్చిందన్న దానిపై రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టింది.

Tags

Next Story