Delhi Air Pollution : ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..

Delhi Air Pollution :  ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..
X
గ్రాప్ 1, 2పై మాత్రం కొనసాగుతున్న ఆంక్షలు

ఢిల్లీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టింది. దీంతో విద్యా సంస్థల్లో ఫిజికల్ క్లాసులు నిర్వహించేందుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 187 పాయింట్లుగా నమోదైంది. మరోవైపు వాయు కాలుష్య తీవ్రత 300 పాయింట్లకు దిగువకు రావడంతో సుప్రీంకోర్టు గ్రాప్ 3, 4 ఆంక్షలను సడలించింది. అయితే గ్రాప్ 1, 2పై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.

స్టేజ్ 2 కింద.. హోటళ్లు, రెస్టారెంట్లు, ఓపెన్ ఈటరీలు, బొగ్గు, కట్టెల వాడకంపై నిషేధం ఉంటుంది. రాజధాని ప్రాంతం (NCR)లో హైవేలు, ఫ్లైఓవర్లు , పైప్‌లైన్‌ల వంటి పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లతో సహా అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలు కూడా నిషేధించబడ్డాయి.

అక్టోబర్ 30 నుంచి ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత 15 రోజులు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా పూర్ గా నమోదైంది. నవంబర్ ద్వితీయార్థంలో AQI స్థాయిలు 400 కంటే ఎక్కువగా ఉండటంతో గాలి నాణ్యత మరింత దిగజారింది. బలమైన గాలుల కారణంగా డిసెంబర్‌లో ఇది కొద్దిగా మెరుగుపడింది.

ప్రస్తుతం గాలి నాణ్యత మెరుగుపడటంతో ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాలలో కాలుష్య నియంత్రణలు సడలించబడ్డాయి. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM).. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య నివారణ, నియంత్రణకు బాధ్యత వహించే GRAP (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) స్టేజ్-4 , స్టేజ్-3ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది.

Tags

Next Story