Mamata Banerjee: బెంగాల్ టీచర్ల నియామకాల రద్దు చెల్లదు

పశ్చిమ బెంగాల్‌లో 32 వేల మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు కలకత్తా హైకోర్టులో భారీ ఊరట లభించింది. వారి నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ బుధవారం పక్కన పెట్టింది. ఈ నియామకాలన్నీ చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేస్తూ కీలక తీర్పు వెలువరించింది.
నియామక పరీక్షలో కొందరు అభ్యర్థులు విఫలమైనంత మాత్రాన మొత్తం వ్యవస్థపై ప్రభావం పడకూడదని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఇంతవరకు నిరూపితం కాలేదని పేర్కొంది. ఇప్పటికే తొమ్మిదేళ్లుగా సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగిస్తే, వారిపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. కేవలం కొనసాగుతున్న విచారణను ఆధారంగా చేసుకుని నియామకాలను రద్దు చేయలేమని వివరించింది.
ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. వేలాది టీచర్ల కుటుంబాలకు న్యాయస్థానం గొప్ప ఊరటనిచ్చిందని అన్నారు. యువతకు కొత్త ఉద్యోగాలు సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఉన్న ఉద్యోగాలను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు మానవతా దృక్పథంతో ఆలోచించి తీర్పు ఇచ్చారని ఆమె ప్రశంసించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

