Sai Baba: వారణాసి ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు

Sai Baba: వారణాసి ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు
14 ఆలయాల నుంచి తొలగింపు, మరో 28 ఆలయాల నుంచి తొలగిస్తామన్న సనాతన్ రక్షక్ సేన

ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం కొనసాగుతోంది. సాయిబాబా హిందూ దేవుడు కాదని, ఆయన విగ్రహాలను తొలగించాలన్న హిందూ సంస్థల పిలుపు మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగిస్తున్నారు సనాతన్ రక్షక్ సేనకు చెందిన అజయ్ శర్మ నేతృత్వంలో ఇప్పటి వరకు 14 ఆలయాల నుంచి బాబా విగ్రహాలను తొలగించారు. వీటిలో ప్రముఖ ఆలయమైన బాబా గణేశ్ మందిర్ కూడా ఉంది.

మరో 28 ఆలయాల్లోని విగ్రహాలను కూడా తొలగించనున్నారు. సనాతన ధర్మంతో సాయిబాబాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న సంస్థలు.. సాయిబాబాను పూజించడాన్ని తాము వ్యతిరేకించబోమని, కాకపోతే వాటిని హిందూ ఆలయాల్లో ప్రతిష్ఠించడానికి వ్యతిరేకమని తేల్చి చెప్పాయి. సాయిబాబాను ‘చాంద్ బాబా’గా పేర్కొనాలన్న సుప్రీంకోర్టు ఆర్డర్ చెబుతోందని దీపక్ యాదవ్ అనే వ్యక్తి గుర్తుచేశారు.

సాయిబాబాను పూజించాలనుకునే వారు ప్రత్యేకంగా ఆయన ఆలయంలోనూ పూజించుకోవచ్చని, వాటిని హిందూ ఆలయాల్లో ప్రతిష్ఠించడాన్నే తాము తప్పుబడుతున్నట్టు దీపక్ పేర్కొన్నారు. హిందూమతం అన్ని విశ్వాసాలకు అనుగుణంగా ఉంటుందని, అందుకనే హిందువులు షిర్డీని సందర్శిస్తారని పేర్కొన్నారు. ఎవరు ఎప్పుడైనా ఆయనను పూజించుకోవచ్చని, వ్యక్తిగత జీవితంలోకి ఎవరూ జోక్యం చేసుకోరని పేర్కొన్నారు.

సనాతన్ రక్షక్ సేన ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు అజయ్ శర్మ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 14 ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించినట్టు చెప్పారు. మరిన్ని ఆలయాల నుంచి కూడా తొలగిస్తామని చెప్పారు. సనాతన ధర్మంపై ఏమాత్రం అవగాహన లేనివారు మాత్రమే సాయిబాబా విగ్రహాలను ఇతర ఆలయాల్లో ప్రతిష్ఠిస్తున్నారని తెలిపారు. సనాతన ధర్మం ఇందుకు అనుమతించదని, హిందూ ఆలయాల్లో సూర్యుడు, విష్ణువు, శివుడు, శక్తి, గణేశుడి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలని పేర్కొన్నారు. భూతేశ్వర్, అగస్తేశ్వర్ ఆలయాల నుంచి కూడా సాయిబాబా విగ్రహాలను తొలగిస్తామని చెప్పారు. సాయిబాబాను ‘మహాత్మా’గా మాత్రమే పూజించాలని, దేవుడిగా కాదని చెప్పారు.

ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడాన్ని సమాజ్‌వాదీ పార్టీ తప్పుబట్టింది. ఇదంతా బీజేపీ పొలిటికల్ స్టంట్ అని ఆ పార్టీ కౌన్సిల్ సభ్యుడు అశుతోష్ సిన్హా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిబాబాను మహారాష్ట్రలో పూజిస్తారని, హిందూ మతం కూడా ఆయనను తనలో కలుపుకొన్నదని గుర్తుచేశారు. శతాబ్దాలుగా ఇది కొనసాగుతోందని చెప్పారు.

Tags

Next Story