'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' రూపశిల్పి రామ్ సుతార్ కన్నుమూత

ప్రఖ్యాత భారతీయ శిల్పి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత రామ్ వి. సుతార్ (100) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన నోయిడాలోని తన కుమారుడి నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుజరాత్‌లోని ప్రపంచ ప్రసిద్ధ 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ', హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై కొలువుదీరిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాలకు రూపకల్పన చేసింది రామ్ సుతార్ కావడం విశేషం.
1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని గోందూర్ గ్రామంలో ఒక సాధారణ విశ్వకర్మ కుటుంబంలో రామ్ సుతార్ జన్మించారు. తన అద్భుతమైన ప్రతిభతో శిల్పకళా రంగంలో శిఖరాలను అధిరోహించారు. ఆయన రూపొందించిన అనేక కళాఖండాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గౌరవార్థం నిర్మించిన 182 మీటర్ల 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయనకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
అదేవిధంగా, హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహాన్ని కూడా రామ్ సుతార్ తీర్చిదిద్దారు. శిల్పకళా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, కళారంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

