PAWAR: వారి స్థానమెంటో తెలిసేలా చేస్తా: శరద్‌ పవార్‌

PAWAR: వారి స్థానమెంటో తెలిసేలా చేస్తా: శరద్‌ పవార్‌
పార్టీని పునర్నిస్తామని శరద్‌ పవార్‌ ప్రకటన.... ఉద్వేగపూరిత ప్రసంగం చేసిన ఎన్సీపీ అధినేత... తమ సత్తా చూపుతామని స్పష్టీకరణ

నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీని ముక్కలు చేయడానికి ప్రయత్నించిన వారికి తమ స్థానం ఏంటో చూపిస్తానని ఆ పార్టీ అధినేత శరద్ పవార్‌ హెచ్చరించారు. పార్టీని తిరిగి పునర్నిస్తానని ప్రతిజ్ఞ చేశారు. సతారా జిల్లాలోని కారాడ్‌లో పర్యటించిన ఆయనకు.. దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. పవార్‌కు స్వాగతం పలకడానికి దారి పొడవునా వేలాది మంది మద్దతుదారులు బారులు తీరారు. మార్గమధ్యంలో వాహనాన్ని ఆపిన ఆయన మద్దతుదారులను కలుసుకున్నారు. కారాడ్‌లో గురుపౌర్ణమి సందర్భంగా తన తొలి గురువు, మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్‌ స్మారకం వద్ద ఎన్సీపీ అధినేత నివాళులు అర్పించారు. అనంతరం తన మద్దతుదారులతో బల ప్రదర్శన నిర్వహించి కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా మాట్లాడారు. తనకు 44 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్నారు. తిరుగుబాటుదారులు తిరిగి రావొచ్చని.. కానీ దానికి టైం పడుతుందన్నారు.


బీజేపీ అన్ని ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని పవార్‌ మండిపడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్రలో, అలాగే దేశంలో కులం, మతం పేరిట కొన్ని వర్గాలు విభేదాలు సృష్టిస్తున్నాయని... వాటిపై ఈ రోజు నుంచే తన పోరాటం మొదలవుతుందని పవార్‌ వెల్లడించారు. ఎన్సీపీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన వారికి తామ స్థానమెంటో చూపిస్తామని హెచ్చరించారు. అజిత్ పవార్ తిరుగుబాటుతో తాను అధైర్యపడలేదని.. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్తానని స్పష్టం చేశారు. ఇలాంటి అసమ్మతి వస్తూనే ఉంటుందని.. కానీ వీటన్నింటిని దాటుకొని తాను పార్టీని పునర్నిర్మిస్తానని... పార్టీ అధ్యక్షుడిగా అది తన బాధ్యతని పవార్‌ తన భవిష్యత్‌ ప్రణాళికను వెల్లడించారు. తమతో ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదని, పార్టీనే ముఖ్యమని అన్నారు. ఎన్సీపీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన వారికి తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు.

ఎన్సీపీ కీలక నేత అజిత్‌ పవార్‌ మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికార పక్షంలో చేరారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే, అజిత్‌ వర్గానికి పార్టీ మద్దతు లేదని ఎన్సీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అజిత్‌ పవార్‌ సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ను ఎన్సీపీ అభ్యర్థించింది.

Tags

Read MoreRead Less
Next Story