Lalu on Modi: ఓడిపోయాక విదేశాలకే

కాస్త ఆరోగ్యం బాగు పడిందో లేదో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి వెటకారాలు మొదలు పెట్టేసారు. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామనే ఆందోళనలో ఉన్నారని, అందుకే విదేశాల్లో ఆశ్రయాల కోసం వెతుకులాడుతున్నారు అంటూ కామెంట్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో విమర్శలు సంధించారు. ఈస్టిండియా కంపెనీలో, ముజాహిదీన్ ఇండియాలోనూ కూడా ఇండియా అనే పదం ఉన్నదన్న మోదీ, ఆ టీమ్ పై క్విట్ ఇండియా అంటూ వెటకారం చేశారు. అవినీతి, బంధుప్రీతితో రాజకీయాలు చేసే కొత్త కూటమి ‘ఇండియా’ ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌ను కోరగా.. ఆయన ప్రధాని మోడీపై చమత్కార బాణాలు వేశారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంలో మోడీ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్‌లు చేసుకుంటున్నారన్నారు. అందుకే ఆయన అనేక దేశాలు తిరిగి తనకు నచ్చిన ఫుడ్ దొరికే ప్రాంతం కోసం వెతుక్కుంటున్నారు అన్నారు. లాలూ కొడుకు బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న లాలు ప్రసాద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. లాలు కామెంట్‌తో అక్కడ నవ్వులు విరిసాయి. ఎంత గంభీరమైన వాతావరణంలోనూ తన కామెంట్లతో వాతావరణాన్ని తేలిక పరిచే వ్యక్తిగా లాలు ప్రసాద్‌కు మంచి పేరు ఉంది. కొద్ది రోజుల క్రితం విపక్షాల సమావేశంలో లాలు రాహుల్ పై కూడా ఇలాగే కామెంట్ లు చేశారు. ఇప్పటికైనా నా మాట విను. సమయం మించిపోలేదు. ఆ గడ్డం తీసేసి పెళ్లి చేసుకో నీ పెళ్లి బారాత్ కు వస్తామంటూ లాలు ప్రసాద్ యాదవ్ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్ కూడా తప్పకుండా అంటూ నవ్వుతూ బదులిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com