Rohan Bopanna: భారత టెన్నిస్‌కు రోహన్ బోపన్న వీడ్కోలు

Rohan Bopanna: భారత టెన్నిస్‌కు రోహన్ బోపన్న వీడ్కోలు
X
భారత జెర్సీలో చివరి మ్యాచ్‌ ఆడేశానంటూ ప్రకటన

భారత టెన్నిస్‌ వెటరన్‌ రోహన్‌ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించాడు. భారత్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ను ఆడేసినట్టు బోపన్న తెలిపాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో బోపన్న-శ్రీరామ్‌ బాలాజీ.. 5-7, 2-6తో రోజర్‌-మొన్‌ఫిల్స్‌ (ఫ్రెంచ్‌) చేతిలో ఓడి ఇంటిబాట పట్టారు. మ్యాచ్‌ అనంతరం బోపన్న మాట్లాడుతూ.. ‘దేశం తరఫున ఇదే నా చివరి మ్యాచ్‌. నేను ఎక్కడున్నాను? అనేదానిపై నాకు పూర్తి అవగాహన వచ్చింది’ అని అన్నాడు. దేశం తరఫున రిటైర్మెంట్‌ ప్రకటించినా ప్రొఫెషనల్‌ గ్రాండ్‌స్లామ్‌, ఏటీపీ టోర్నీలలో మాత్రం కొనసాగనున్నాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య రీతిలో తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైన భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. భారత టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోనని స్పష్టం చేశాడు. దేశం తరపున ఇదే తన చివరి మ్యాచ్ అని చెప్పాడు. ఆటపరంగా తాను ఏ స్థితిలో ఉన్నానో స్పష్టంగా అర్థమైందని వ్యాఖ్యానించాడు. వీలైనంత కాలం టెన్నిస్‌ను ఆస్వాదిస్తూ ఉంటానని స్పష్టం చేశాడు. ఏటీపీ టోర్నీల్లో ఆడతానంటూ బోపన్న క్లారిటీ ఇచ్చాడు.

2026 జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ నుంచి భారత్ తరపున తప్పుకుంటానని తెలిపాడు. కాగా డేవిస్ కప్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలుగా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, అందుకు చాలా గర్వపడుతున్నానని రోహన్ బోపన్న పేర్కొన్నారు. కాగా ఒలింపిక్స్ మెడల్ సాధించాలన్న బోపన్న కల నెరవేరకుండానే కెరీర్‌కు ముగింపు పలకాల్సి వచ్చింది.

2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌ అతడికి మూడవ ఒలింపిక్స్‌గా ఉంది.

Tags

Next Story