Ayodhya: రాముడి గర్భగుడిలోకి వర్షపు నీరు

6 నెలల క్రితమే ప్రారంభం.. ఇంతలో నీరు లీకేజ్

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా అర్ధ సంవత్సరం కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకేజీ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆలయ ప్రధాన ఆర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్‌ మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికే ఆలయం పైకప్పు నుంచి నీరు కారుతున్నదని చెప్పారు. రామ్‌లల్లా విగ్రహం ప్రతిష్ఠించిన చోటే నీరు లీక్‌ అవుతున్నదని తెలిపారు. దీంతో ఆలయ నిర్మాణంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.

నీళ్ల లీకేజీ తీవ్రమైన సమస్య అని, పరిష్కారంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, విచారణ చేపట్టాలని సత్యేంద్ర దాస్‌ డిమాండ్‌ చేశారు. నిర్మాణంలో సమస్యలేమిటో తెలుసుకోవడంపై దృష్టి పెట్టాలని, వాటిని 1-2 రోజుల్లో పరిష్కరించాలన్నారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించకుంటే, వర్షాలు పెరిగే కొద్దీ పూజలు చేయడం కష్టతరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రామ మందిరానికి వాటర్‌ డ్రైనేజీ మార్గం లేదని, పై నుంచి నీరు లీకేజీ అయిన తర్వాత అవి బలరాముడి విగ్రహం ఉన్న చోటు వద్దకు చేరుకుంటున్నాయని చెప్పారు.

మరో ఏడాది వ్యవధిలో అంటే 2025, జూలై నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని సత్యేంద్ర దాస్‌ పేర్కొన్నారు. ఒకవేళ ఆలోగా అయితే మంచిదేనని, అయితే ఇంకా చాలా పని ఉన్నదని తెలిపారు.

అయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది జనవరి 22న ఎంతో అర్భాటంగా నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీన్ని బీజేపీ తన సొంత కార్యక్రమంలా నిర్వహించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. రాజకీయ, సినిమా, పరిశ్రమ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు చూసేందుకు లైవ్‌ ఏర్పాట్లు కూడా చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నేతృత్వంలో చేపట్టిన ఈ రామ మందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లుగా ఉన్నది. ఆలయ నిర్మాణం, అనంతర నిర్వహణ కోసం ట్రస్టుకు దాతల నుంచి దాదాపు రూ.3,500 కోట్ల మేర వచ్చాయి.

Tags

Next Story