Ropeway : బిహార్‌లో ప్రారంభానికి ముందే కుప్పకూలిన రోప్‌వే..

Ropeway : బిహార్‌లో ప్రారంభానికి ముందే కుప్పకూలిన రోప్‌వే..
X
రూ.13 కోట్లు వృథా, 6 ఏళ్లుగా నిర్మాణం, తీవ్ర విమర్శలు

బిహార్‌లోని రోహతాస్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. సుమారు రూ.13 కోట్ల వ్యయంతో నిర్మించిన రోహతాస్‌గఢ్ కోట రోప్‌వే.. ప్రారంభానికి కొన్ని రోజుల ముందే కుప్పకూలడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 26వ తేదీన నిర్వహించిన ట్రయల్ రన్ సమయంలో ఆ రోప్‌వే కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 1వ తేదీన ఈ రోప్‌వే ప్రారంభోత్సవం జరగనుండగా.. ఇప్పుడే కూలిపోవడంతో కుప్పకూలింది. రూ.13 కోట్ల వ్యయంతో 6 ఏళ్ల పాటు నిర్మించిన ఈ ప్రాజెక్టు నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

చారిత్రక రోహతాస్‌గఢ్ కోట, రోహితేశ్వర్ ధామ్‌ను సందర్శించే పర్యాటకులు, భక్తుల కోసం ఈ రోప్‌వేను నిర్మించారు. న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన ఈ రోప్‌వేను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోప్‌వే లోడ్ సామర్థ్యాన్ని పరీక్షించే రెండో దశ ట్రయల్ రన్ జరుగుతుండగా.. టవర్ నంబర్ 5 సమీపంలోని ఒక పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది.

ఒక పిల్లర్ కూలడంతో దాని ప్రభావం వల్ల వరుసగా ఇతర పిల్లర్లు, నాలుగు ట్రాలీ క్యాబిన్లు కూడా కుప్పకూలిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో ట్రాలీలు ఖాళీగా ఉండటం, సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ రోప్‌వే పొడవు

1,324 మీటర్లు కాగా.. సముద్ర మట్టానికి సుమారు 1,400 అడుగుల ఎత్తున ఉన్న కోటకు చేరుకోవడానికి దీన్ని నిర్మించారు. కోల్‌కతాకు చెందిన రోప్‌వే అండ్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఆర్‌పీఎల్) సంస్థ ఈ రోప్‌వేను నిర్మించింది. ఈ రోప్ వే ప్రాజెక్టును పూర్తి చేయడానికి సుమారు 6 ఏళ్ల సమయం పట్టింది.

ఈ ఘటనపై బిహార్ స్టేట్ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఐఐటీ పాట్నా నిపుణులతో రోప్‌వే డిజైన్, క్వాలిటీ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టులో నాణ్యత లేని వస్తువులను వాడటం వల్లే ఇలా జరిగిందని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమీషన్ల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టు భద్రతపై పూర్తిస్థాయి భరోసా వచ్చే వరకు ఆ రోప్‌వేను ప్రారంభించబోమని.. పునర్నిర్మాణ ఖర్చులను కూడా నిర్మాణ సంస్థే భరించాలని అధికారులు స్పష్టం చేశారు.

Tags

Next Story