Madhya Pradesh: జీతం రూ.45వేలు, ఆదాయం మాత్రం రూ. 10 కోట్లు...

Madhya Pradesh: జీతం రూ.45వేలు, ఆదాయం మాత్రం రూ. 10 కోట్లు...
ఆసుపత్రిలో స్టోర్ కీపర్‌గా పనిచేసి రిటైరైన వ్యక్తికి ఆదాయానికి మించి ఆస్తులు

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అనుమానంతో మధ్యప్రదేశ్‌ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగికి ఇంటికి వెళ్లారు అధికారులు.. తీరా వెళ్ళాక అసలు అది అతని ఇల్లు కాదేమో. ఏ కోటీశ్వరుడి ఇల్లేమో అన్న అనుమానం వచ్చింది వారికి ఎందుకంటే ఇంట్లో అణువణువునా కనపడుతున్న రిచ్ నెస్.

అష్పాక్ అలీ అనే వ్యక్తి మధ్యప్రదేశ్‌ ఆరోగ్య శాఖ విభాగం లో స్టోర్‌ కీపర్‌ గా పని చేసి రిటైర్‌ అయ్యారు. అప్పట్లో అతని జీతం నెలకు రూ.45 వేలు. అయితే, అలీ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు సమాచారం అందుకున్న లోకాయుక్త అధికారులు ఆయన ఇంట్లో తాజాగా సోదాలు చేపట్టారు. కానీ ఇంట్లోని వస్తువులు చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. మాడ్యులర్‌ కిచెన్‌, లక్షల రూపాయల విలువైన షాన్డిలియర్‌, ఖరీదైన సోఫాలు, షో కేసులు, రిఫ్రిజరేటర్‌, టీవీ ఉన్నాయి. ఓ చిరుద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో ఇంత ఖరీదైన వస్తువులు చూసి షాక్‌ అయ్యారు.


మొత్తం ఆయన ఆస్తుల విలువ రూ. 10 కోట్లు ఉంటుందని అంచనాకు వచ్చారు. అలీ భార్య, కుమారుడు, కుమార్తె పేరిట ఉన్న రూ. 1.25 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 16 స్థిరాస్తుల పేపర్లను గుర్తించారు.రూ.46 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.



ఇవి కాక మరో నాలుగు భవనాలు, ఒక నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ గురించి కూడా సమాచారం అందుకున్నారు. వీటితో పాటు అతను ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అలీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story