Karnataka: ఎస్‌బీఐలో దోపిడీ ముఠా బీభత్సం.. 50 కిలోల బంగారం, రూ.8 కోట్ల నగదు అపహరణ

కర్ణాటకలో మరోసారి భారీ బ్యాంకు దోపిడీ కలకలం సృష్టించింది. విజయపుర జిల్లా చడ్చనా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ఏకంగా 50 కిలోల బంగారం, రూ.8 కోట్ల నగదును దోచుకెళ్లారు. మంగళవారం సాయంత్రం సైనిక దుస్తులను పోలిన దుస్తులతో బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు, తుపాకులతో సిబ్బందిని బెదిరించి ఈ లూటీకి పాల్పడ్డారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో బ్యాంకు మూసివేసే వేళ, ముసుగులు ధరించిన దుండగులు బ్యాంకులోకి చొరబడ్డారు. లోపలికి రాగానే నాటు తుపాకులు, ఇతర ఆయుధాలతో మేనేజర్, క్యాషియర్ సహా మిగతా సిబ్బందిని బెదిరించారు. అలారం బటన్ నొక్కకుండా వారిని కట్టడి చేసి, అందరినీ తాళ్లతో కట్టేశారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ వివరాలు తెలుసుకొని అందులోని బంగారం, నగదును దోచుకొని పరారయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయపుర ఎస్పీ లక్ష్మణ్ నింబార్గి స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ముగ్గురి కంటే ఎక్కువ మంది ఈ దోపిడీలో పాల్గొని ఉంటారని, పక్కా ప్రణాళికతోనే దీనిని అమలు చేశారని పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ అనంతరం దుండగులు మహారాష్ట్ర వైపు పారిపోయి ఉంటారని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
కాగా, ఇదే విజయపుర జిల్లాలో నాలుగు నెలల క్రితం మే నెలలో కూడా కెనరా బ్యాంకులో ఇలాంటి భారీ దోపిడీ జరిగింది. అప్పుడు దుండగులు 58 కిలోల బంగారం, రూ.5.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. స్వల్ప వ్యవధిలోనే మరో బ్యాంకులో ఇంత పెద్ద దోపిడీ జరగడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com