Kerala: బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య..!

Kerala: బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య..!
X
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో..

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఓ ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిక్కన్నపురం నివాసి ఆనంద్ కె. తంపి తన షెడ్‌లో శనివారం ఉరి వేసుకుని బలవన్మణానికి పాల్పడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో కలత చెందినట్లు సమాచారం. తిరువనంతపురం కార్పొరేషన్‌లోని త్రిక్కన్నపురం వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని తంపి ఆశిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు రాలేదు. ఇది చూసి ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. బీజేపీ తనకు టికెట్టు ఇవ్వకున్నా.. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని తంపి సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ తర్వాత శనివారం మధ్యాహ్నం తన స్నేహితులకు వాట్సాప్ సందేశం పంపారు. అందులో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సందేశంలో పేర్కొన్నారు. వాట్సాప్ సందేశాన్ని చూసిన అతని స్నేహితులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆ కార్యకర్త ఉచ్చుకు వేళాడుతూ కనిపించారు. వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే తన ఉద్దేశ్యాన్ని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు ఇప్పటికే తెలియజేసినట్లు తంపి తన సందేశంలో పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా మాఫియాతో సంబంధం ఉన్న కొంతమంది స్థానిక నాయకుల ప్రయోజనాల కారణంగా తనకు టికెట్ నిరాకరించారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను ప్రకటించిన తర్వాత.. తన స్నేహితులు సైతం తనకు దూరం కావడం ప్రారంభించారని.. అది తనను నిరాశపరిచిందని సందేశంలో పేర్కొన్నారు. అయితే, టికెట్ కోసం తంపి తమను ఎప్పుడూ సంప్రదించలేదని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు. టికెట్టు రాకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వాదనలను తోసిపుచ్చారు. ఈ సంఘటనకు టికెట్ నిరాకరించడానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్టీ ఖచ్చితంగా దర్యాప్తు నిర్వహిస్తుందని తెలిపారు. “ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అంశంపై జిల్లా అధ్యక్షుడిని విచారించాను. వార్డు స్థాయి నుంచి పంపిన షార్ట్‌లిస్ట్‌లో తంపి పేరు లేదని నాకు తెలిసింది. ఈ విషయంపై పార్టీ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుంది.” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.

Tags

Next Story