Krasheninnikov Volcano: 600 ఏండ్ల తర్వాత రష్యాలో పేలిన అగ్నిపర్వతం..

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఓ అద్భుతం, అదే సమయంలో భయానక దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు ఆరు శతాబ్దాల క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. నిన్న జరిగిన ఈ భారీ విస్ఫోటనంతో సుమారు 6 కిలోమీటర్ల (3.7 మైళ్లు) ఎత్తు వరకు బూడిద, ధూళి ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో, దాని ప్రభావం వల్లే ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిందని నిపుణులు అనుమానిస్తున్నారు.
రష్యా అధికారులు విడుదల చేసిన సమాచారం ప్రకారం, అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద తూర్పు దిశగా పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతోంది. అదృష్టవశాత్తు, అది ప్రయాణిస్తున్న మార్గంలో ఎలాంటి జనావాసాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఏ నివాస ప్రాంతంలోనూ బూడిద రాలినట్లు నమోదు కాలేదని స్పష్టం చేశారు. అయితే, అగ్నిపర్వతం నుంచి ఇంకా స్వల్ప స్థాయిలో విస్ఫోటనాలు కొనసాగే అవకాశం ఉందని కమ్చట్కా వోల్కానిక్ ఎరప్షన్ రెస్పాన్స్ టీమ్ (కేవీఈఆర్‌టీ) హెచ్చరించింది.
ఈ విస్ఫోటనం జరిగిన సమయంలోనే 7.0 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించింది. దీంతో కమ్చట్కాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసి, ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా జపాన్, అలస్కా తీరాల్లో చిన్నపాటి సునామీ అలలు కూడా నమోదయ్యాయి.
"చారిత్రక ఆధారాల ప్రకారం 600 ఏళ్లలో క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం బద్దలవడం ఇదే మొదటిసారి" అని కేవీఈఆర్‌టీ హెడ్ ఓల్గా గిరినా తెలిపారు. అయితే, స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ రికార్డుల ప్రకారం చివరి విస్ఫోటనం సుమారు 475 ఏళ్ల క్రితం (1550లో) జరిగిందని పేర్కొంది. ఈ కాలక్రమంపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
సమీపంలోని మరో అగ్నిపర్వతాన్ని సందర్శించి తిరిగి వస్తున్న పర్యాటక గైడ్‌లు ఈ అరుదైన విస్ఫోటన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోలను రాయిటర్స్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. 1,856 మీటర్ల ఎత్తున్న ఈ అగ్నిపర్వతం అకస్మాత్తుగా మేల్కొనడం ప్రపంచవ్యాప్తంగా భూగర్భ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com