Jaishankar: హైజాక్ అయిన ఆ విమానంలో మా నాన్న ఉన్నారు: జైశంకర్

Jaishankar:  హైజాక్ అయిన ఆ విమానంలో మా నాన్న ఉన్నారు:  జైశంకర్
1984 హైజాకింగ్ ఘటనకు సంబంధించిన విషయం బయట పెట్టిన విదేశాంగమంత్రి

భారత విదేశాంగమంత్రి ఎస్‌.జై శంకర్ షాకింగ్ విషయం ఒకటి వెల్లడించారు. 1984లో హైజాక్అ యిన విమానంలో తన తండ్రి ఉన్నారని వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి..‘ది కాంధార్‌ హైజాక్‌’ సిరీస్‌ గురించి మాట్లాడుతూ ఈ ఆశ్చర్యకర విషయం తెలియజేశారు.

‘‘ఈ సిరీస్‌ నేను చూడలేదు. కాబట్టి దానిపై నేను మాట్లాడలేను. 1984లో కూడా ఒక హైజాక్ జరిగింది. అప్పుడు నేను ఉద్యోగంలో చేరి కొంతకాలమే అవుతోంది. ఆ హైజాక్‌ ఘటనను డీల్ చేసే బృందంలో నేను కూడా ఉన్నాను. దాంతో ఇంటికి రావడం కుదరదని మా అమ్మకు ఫోన్‌ చేసి చెప్పాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆ విమానంలో మా నాన్న ఉన్నారని. అదృష్టవశాత్తూ విమానంలో ఉన్నవారికి ఏమీ కాలేదు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒకవైపు హైజాక్‌కు సంబంధించిన వ్యవహారాన్ని చూస్తోన్న బృందంలో పనిచేస్తూ.. హైజాక్‌పై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కుటుంబ సభ్యుల్లోనూ నేను ఉన్నాను’’ అంటూ ఇంతకాలం ఎవరికీ పెద్దగా తెలియని విషయాన్ని చెప్పి మంత్రి ఆశ్చర్యపర్చారు.

ఆగస్టు 24, 1984లో ఈ హైజాక్ ఘటన జరిగింది. భారత్‌కు చెందిన విమానం IC421కు ఈ పరిస్థితి తలెత్తింది. అది దిల్లీ నుంచి టేకాఫ్‌ అయింది. చండీగఢ్‌లో ల్యాండ్ కాగానే ఏడుగురు హైజాకర్లు కాక్‌పిట్‌లోకి చొరబడ్డారు. వారంతా ఆల్‌ ఇండియా సిఖ్‌ స్టూడెంట్ ఫెడరేషన్‌కు చెందినవారు. అందరి వయసు 25లోపే ఉంది. జర్నైల్ సింగ్ బ్రింధన్‌వాలేతో పాటు ఇతరులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 36 గంటల పాటు ఆ విమానం ఠాన్ కోట్, లాహోర్, కరాచీ, చివరకు దుబాయ్‌ ఇలా నాలుగు విమానాశ్రయాల మధ్య తిరిగింది. అలా ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చివరకు అందులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

Tags

Next Story