Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం

Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం
శబరి గిరులకు భారీగా భక్తులు

దాదాపు 2 నెలలుగా జరుగుతున్న శబరిమల అయ్యప్ప దర్శనాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మరో వారం రోజుల్లో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలోనే అయ్యప్ప భక్తులతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. ఈ క్రమంలోనే నేడు మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ మకర జ్యోతిని స్వయంగా దర్శించుకునేందుకు దేశంలోని వేలాది మంది భక్తులు ఇప్పటికే శబరిమలకు చేరుకున్నారు. ఇక టీవీల్లో, సోషల్ మీడియాలో మకర జ్యోతిని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు.

శబరిమల మకరజ్యోతి దర్శనం సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీంతోపాటు టీవీలలో లైవ్ ప్రసారాలు కూడా చేయనున్నట్లు వెల్లడించింది. శబరిమల మకరజ్యోతి ఘట్టం 2 నుంచి 3 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. 3 సార్లు మాత్రమే మకర జ్యోతి వెలుగుతుంది. అయితే మకర జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో భక్తుల కోసం ట్రావెన్‌కోర్‌ బోర్డు ప్రత్యేకంగా వ్యూ పాయింట్లను ఏర్పాటు చేసింది. జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి ఇచ్చామని తెలిపింది. అయితే నాలుగు లక్షల మంది వరకు శబరిమలకు చేరుకుంటారని తెలుస్తున్నది. శబరిమల మకరజ్యోతి లేదా మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున దర్శనమిస్తుంది. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనమిస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు.

శబరిమల అయ్యప్ప ఆలయంలో మొదట 40 రోజుల పాటు కొనసాగిన మండల పూజల సమయంలో భారీగా భక్తులు విచ్చేయడంతో.. ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 27 వరకు కేవలం 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి రూ.241 కోట్ల ఆదాయం సమకూరింది.

ఈసారి అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇందులో అయ్యప్ప మాల వేసుకున్న వారే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సాధారణ భక్తులు కూడా వచ్చారు. దీంతో కొన్నిసార్లు శబరిమలలో భక్తుల రద్దీ పోటెత్తింది. దీంతో కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుతిరిగారు. మరికొంతమంది క్యూ లైన్లలో కిలోమీటర్ల తరబడి నిలబడి.. చివరికి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story