SHABARIMALA: శబరిమల అయ్యప్ప దర్శనం ప్రారంభం

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మకరవిళక్కు పూజల కోసం శుక్రవారం సాయంత్రం ఆలయ ద్వారాలను తెరిచారు. దీంతో అయ్యప్ప భక్తులు శబరిగిరులకు భారీగా పోటెత్తారు. దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగించింది. ఇటు వర్చువల్ క్యూ బుకింగ్స్‌ను ట్రావెన్‌కోర్ బోర్డు ప్రారంభించింది. వర్చువల్ దర్శనానికి తొలిరోజే 30వేల మంది భక్తులు టికెట్స్ బుక్ చేసుకున్నారు.
పోటెత్తిన భక్తులు
శబరిమల ఆలయం మండల మకరవిళక్కు పూజల కోసం తెరుచుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరవాల్సి ఉండగా.. భారీగా అయ్యప్ప భక్తులు తరలిరావడంతో ఒక గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది నిత్యం 80 వేల మందికి దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. అయితే ఇందులో 70 వేల మందికి ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. మరో 10 వేల మందికి శబరిమలలోనే 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు అందించనున్నారు. మకరవిళక్కు సీజన్‌లో భాగంగా శబరిమల ఆలయం తెరుచుకోవడంతో మొదటిరోజే భక్తులు భారీగా తరలివచ్చారు. తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ సీజన్‌లో అయ్యప్ప దర్శన వేళలను కూడా పొడిగించినట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబూథిరి తెరవనున్నట్లు అధికారులు వివరించారు.
డిసెంబర్ 26 వరకు పూజలు..
ఈ మండల పూజలు డిసెంబర్ 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత కొద్దిరోజుల విరామం తర్వాత.. డిసెంబర్ 30వ తేదీ నుంచి మొదలయ్యే మకరవిళక్కు పూజలు.. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు సాగనున్నాయి. ఈసారి దర్శన సమయం పొడిగించిన ట్రావెన్‍కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు.. రోజూ 18 గంటల పాటు దర్శనాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అయ్యప్ప దర్శనాలు కొనసాగనున్నట్లు వివరించారు.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి (హైదరాబాద్) - కొల్లాం, ఈ నెల 24, డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం - మౌలాలి, నవంబర్ 18, 25 తేదీల్లో మచిలీపట్నం - కొల్లాం, నవంబర్ 20, 27 తేదీల్లో కొల్లాం - మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com