Sabarimala Prasadam: శబరిమల ప్రసాదం ఇకపై నేరుగా మీ ఇంటికే..

శబరిమలలో మకరవిళక్కు పూజా సీజన్ ప్రారంభం కావడంతో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. అయ్యప్ప భక్తుల రద్దీని నియంత్రించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వివిధ చర్యలు తీసుకుంటోంది. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా స్పాట్ బుకింగ్ టోకెన్లను తగ్గిస్తూ, పెంచుతూ వస్తోంది. ఇకపోతే కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అరవణ పాయసం, అప్పం ప్రసాదంగా ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం పొందడానికి శబరిమలకే వెళ్లాల్సిన అవసరం లేదు. భక్తులు తామున్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే.. నేరుగా శబరిమల నుంచి అరవణ ప్రసాదం ఇంటికే చేరుతుంది. దీనికోసం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేస్తోంది.
శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించలేని భక్తుల కోసం, ఇంట్లో నుంచే అరవణ ప్రసాదాన్ని కొనుగోలు చేసేలా శబరిమలలోని పోస్టాఫీస్ ఏర్పాట్లు చేసింది. భారతదేశంలోని అన్ని పోస్టాఫీసుల నుంచి ఈ శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని దేవస్థానం బోర్డు తెలిపింది. ఇక ఈ ప్రసాద కిట్‌లో నెయ్యి, అరవణ పాయసం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం ఉంటాయి. ఈ విషయమై శబరిమల పోస్టాఫీస్ అధికారులు మాట్లాడుతూ.. భారతదేశంలోని అయ్యప్ప భక్తులందరికీ శబరిమల ప్రసాదాన్ని అందించడమే మా లక్ష్యమని.. దీనికోసం పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రసాదాన్ని ఇంటింటికి చేరవేసే ప్రాజెక్టును ప్రారంభించిందని తెలిపారు.
ఇక పోస్టాఫీసుల ద్వారా ప్రసాదం కొనుగోలు చేయడానికి ధరల విషయానికి వస్తే.. ఒక టిన్ అరవణ ప్రసాదం కిట్ రూ. 520, 4 టిన్ అరవణ ప్రసాదం కిట్ రూ. 960, 10 టిన్ అరవణ ప్రసాదం కిట్ రూ. 1,760 గా నిర్ణయించారు. ఇందుకోసం పోస్టాఫీసులో ప్రసాదం కోసం డబ్బు చెల్లిస్తే, కొద్ది రోజుల్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం నేరుగా మీ ఇంటికి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది మకరవిళక్కు పూజ ప్రారంభమై, కొద్ది రోజుల అనంతరం అయ్యప్ప ఆలయం మూసివేయబడుతుంది. ఆ తర్వాత శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ చేయబడుతుంది. అలాగే వచ్చిన వాటిని పంపాలో భద్రంగా ఉంచుతారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

