Sabarimala Devotees:శబరిమలకు పోటెత్తిన భక్తులు

బరిమలలో రెండు నెలల పాటు జరిగే మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ గందరగోళంతో ప్రారంభమైంది. విపరీతమైన రద్దీ, కనీస సౌకర్యాల లేమి, అధికారుల వైఫల్యంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం నాడు రద్దీని నియంత్రించేందుకు దర్శన సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 90 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించాలని నిర్ణయించినప్పటికీ, సోమవారం నుంచి రోజుకు లక్షకు పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లు సరిపోలేదు. స్వామివారి దర్శనం కోసం భక్తులు 10 నుంచి 15 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. పవిత్రమైన 18 మెట్ల వద్ద భక్తుల ప్రవాహం గణనీయంగా మందగించడంతో, సన్నిధానం నుంచి క్యూలైన్లు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి.
త్రాగునీరు, ఆహారం అందక, గంటల తరబడి నిల్చోవడంతో చిన్నారులు, వృద్ధులు క్యూలైన్లలోనే సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఏర్పాట్లు సరిగా లేవని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు నూతన అధ్యక్షుడు కె. జయకుమార్ స్వయంగా అంగీకరించారు. త్రాగునీటి కేంద్రాలు, బయో-టాయిలెట్లు, ఆహార సరఫరాలో లోపాలున్నాయని ఆయన తెలిపారు.
రద్దీ నియంత్రణకు అవసరమైన కేంద్ర బలగాలైన ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్ అందుబాటులో లేకపోవడం, కేటాయించిన 18,000 మంది పోలీసులకు గాను కేవలం 3,500 మంది మాత్రమే విధుల్లో ఉండటంతో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే, గత ఏడాది (2023) నాటి సంక్షోభం పునరావృతం అవుతుందని, ఎంతోమంది భక్తులు యాత్రను మధ్యలోనే విరమించుకోవాల్సి వస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

