Tamil Nadu: శివరాత్రి వేలంలో పవిత్ర నిమ్మకాయకు రూ. 13,000

తమిళనాడు ఈరోడ్ జిల్లాలో ఒక ఆలయంలో సింగిల్ నిమ్మకాయకు రికార్డ్ ధర రూ. 13,000 పలికింది. శివరాత్రి పర్వదినాన ఆలయంలో పవిత్రంగా భావించే నిమ్మకాయ కోసం భక్తులు పోటీ పడుతుంటారు. నిమ్మకాయకు ప్రతీ ఏడాది వేలం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే వేలంలో రికార్డ్ ధర పలికినట్లు ఆలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
వార్షిక శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా, విలక్కేతి గ్రామంలో పళమ్తిన్ని కరుప్ప ఈశ్వరన్ ఆలయం బుధవారం అర్ధరాత్రి బహిరంగ వేలం నిర్వహించింది. చాలా ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ప్రధాన దేవత విగ్రహంపై ఉంచిన పవిత్ర వస్తువులు, నిమ్మకాల, వెండి ఉంగరం, వెండి నాణెం వంటి వాటిని వేలం వేస్తుంటారు. వీటిని దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.
తంగరాజ్ అనే భక్తులు నిమ్మకాయని రూ. 13,000కి కొనుగోలు చేయగా, అరచలూరుకు చెందిన చిదంబరం వెండి ఉంగరాన్ని రూ.43,100కి కొనుగోలు చేశారు. రవికుమార్, భానుప్రియ ఇద్దరు సంయుక్తంగా వెండి నాణేన్ని రూ. 35,000కు దక్కించుకున్నారు. ఈ వస్తువులు తమ ఇళ్లకు చేరడం వల్ల తమకు అంతా శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com