SAIF: సైఫ్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు

SAIF: సైఫ్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు
X
కీలక అంశాలు వెల్లడించిన నిందితుడు

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. థానేలో శనివారం అర్ధరాత్రి అసలైన నిందితుడు విజయ్‌ దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరికాసేపట్లో ముంబై డీసీపీ కార్యాలయంలో పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సైఫ్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

విభిన్న పేర్లతో..

సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసి పారిపోయిన దుండగుడు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని పోలీసుల విచారణలో తేలింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఇతడు 6 నెలలుగా ముంబయిలోనే నివసిస్తున్నాడు. విజయ్ దాస్ అనే పేరుతో ఒకహౌజ్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేసే ఇతడి అసలు పేరు షరీఫుల్ ఇస్లాం. బిజయ్ దాస్, మహ్మద్ ఇలియాస్ ఇలా రకరకాల మారు పేర్లతో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.గురువారం తెల్లవారుజామున నటుడు సైఫ్‌ను అతడి ఇంట్లోనే దారుణంగా కత్తితో పొడిచి పరారయ్యాడు విజయ్ దాస్ అలియాస్ షరీఫుల్ ఇస్లాం. ఎందుకిలా చేశావని పోలీసులు ప్రశ్నించగా.. అసలు సంగతి బయటపెట్టాడు. నిజానికి తాను దొంగతనానికే సైఫ్ ఇంటికి వెళ్లాలని.. సడన్‌గా సైఫ్ కంటబడటంతో పారిపోయేందుకు కత్తితో పొడిచానని పోలీసులకు తెలిపాడు. త్వరలో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ముంబై డీసీపీ ప్రకటించారు.

సైఫ్‌పై దాడి వెనుక అండర్‌వరల్డ్‌ హస్తం?

సైఫ్ అలీఖాన్ దాడి వెనుక అండర్‌ వరల్డ్‌ హస్తం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలోనే మహారాష్ట్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. సైఫ్ అలీఖాన్ దాడి వెనుక క్రిమినల్ గ్యాంగ్స్‌ ప్రమేయం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు హోంశాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్ పేర్కొన్నారు. ఈ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని ఆయన తెలిపారు. కాగా, ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతోందని మంత్రి యోగేశ్ తెలిపారు.



Tags

Next Story