తల్లీ నీకు వందనం.. వాయనాడ్ బాధితులకోసం ఏకధాటిగా 3 గంటలు నాట్యం చేసిన బాలిక

సాయం చేసే మనసుంటే సంకల్పం తోడవుతుంది. అది చిన్నమొత్తమే కావచ్చు. కానీ ఆ చిన్నారకి వచ్చిన ఆలోచన చాలా పెద్దది. తనకు వచ్చిన విద్యనే పెట్టుబడిగా పెట్టింది. వచ్చిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చింది. వాయనాడ్ బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా సహాయం అందించింది.
హరిణి శ్రీ (౧౩), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలుసుకుంది. వాయనాడ్ కొండచరియలు విరిగిపడి ఇల్లు, వాకిలి కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు సహాయంగా రూ. 15,000 విరాళం అందించింది.
తమిళనాడుకు చెందిన హరిణి శ్రీ వరుసగా మూడు గంటల పాటు భరతనాట్యం ప్రదర్శించింది. ఆమె తన భరతనాట్యం నృత్యాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసి ముఖ్యమంత్రికి చూపించి, ఆయన ఆశీర్వాదం తీసుకుంది.
గత నెలలో వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన కారణంగా నష్టపోయిన ప్రజలకు సహాయం చేసే ప్రయత్నంలో తమిళనాడులో క్రౌడ్ ఫండింగ్ విందుతో సహా అనేక కార్యక్రమాలు జరిగాయి.
జూలై 30న, కుండపోత వర్షాల కారణంగా వాయనాడ్‌లోని ముండక్కై మరియు చూరల్‌మల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి, ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. ఈ విపత్తులో ఇప్పటివరకు 417 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి.
ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 10) వయనాడ్‌లో పర్యటించనున్నారు.
వాయనాడ్ కొండచరియలను జాతీయ విపత్తుగా ప్రకటించడం వలన సహాయ మరియు పునరావాసం కోసం అదనపు నిధులు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది.
శుక్రవారం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి విజయన్ మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడటాన్ని జాతీయ విపత్తుగా, తీవ్ర విపత్తుగా ప్రకటించాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని చెప్పారు.
విపత్తు తీవ్రతను పరిశీలించి నివేదిక సమర్పించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించిందని తెలిపారు.
విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని విజయన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సహాయం మరియు సమగ్ర పునరావాస ప్యాకేజీ లభిస్తుందని, ఈ విషయంలో ప్రధాని మోదీ అనుకూలంగా స్పందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com