Kolkata Doctor Case: ఆర్‌జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ అరెస్ట్

ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకుంది. ఈ దవాఖానలో ఆగస్ట్ 9న ఓ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో డాక్టర్ సందీప్‌ను సీబీఐ 15వ రోజు ప్రశ్నించిన తర్వాత కోల్‌కతాలోని నిజాం ప్యాలెస్ ఆఫీస్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది.
కోల్‌కతా వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నగరంలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ పీజీ వైద్యురాలిగా పనిచేస్తున్న 31 ఏళ్ల యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో సెమినార్ హాలులోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులను విచారించడంలో విఫలమైందని బెంగాల్ ప్రభుత్వాన్ని, కోల్‌కతా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించింది.
, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొదటి నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు సందీప్ ఘోష్‌ని సీబీఐ విచారించింది. తాజాగా ఈ రోజు అతడిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు వారాల పాటు సెంట్రల్ ఏజెన్సీ అధికారులు ఘోష్‌ని ప్రశ్నించిన తర్వాత సోమవారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడికి పాలిగ్రాఫ్ టెస్టుని కూడా నిర్వహించారు.
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7తో పాటు నేరపూరిత కుట్ర, మోసం మరియు నిజాయితీ లేని చర్యలకు పాల్పడ్డాడనే అభియోగాలపై సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. ఈ కేసులు కాగ్నిజబుల్ నేరాలుగా, నాన్-బెయిలబుల్ స్వభావాన్ని కలిగి ఉన్నాయి.
ఘోష్ ఫిబ్రవరి 2021 నుండి సెప్టెంబరు 2023 వరకు ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్‌కి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అక్టోబర్ 2023లో బదిలీ చేసినప్పటికీ, కొద్ది రోజులకే మళ్లీ తన పూర్వ స్థానానికి వచ్చాడు. వైద్యురాలి ఘటన తర్వాత, ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చూశారనే ఆరోపణలు కూడా ఇతడిపై వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com