Sanjay Singh: తీహార్ జైలు నుంచి సంజయ్ సింగ్ విడుదల.

మ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. సంజయ్ సింగ్ తండ్రితో పాటు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సైతం జైలు వద్దకు చేరుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మద్దతుదారులను, ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని.. పోరాటం చేయాల్సిన సందర్భమన్నారు. ఆప్ కీలక నాయకులు అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, సత్యేందర్ జైన్ జైలులో ఉంచారని.. వారు బయటకు వచ్చే వరకు సంబురాలు చేసుకోబోమని.. పోరాటం కొనసాగిస్తామన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. కేసు విషయంలో మాట్లాడొద్దని.. ఢిల్లీని విడిచి వెళ్లే విచారణ అధికారికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు 6 నెలల పాటు సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. అయితే మంగళవారం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ట్రయిల్ కోర్టుకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఇదే జైల్లో ఉన్నారు. ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు. ఇక లిక్కర్ కేసులో ఇటీవలే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఉంది. గురువారం తీర్పు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com