Satya Nadella: భారత్‌లో మైక్రోసాఫ్ట్ అత్యంత భారీ పెట్టుబడి...

Satya Nadella: భారత్‌లో మైక్రోసాఫ్ట్ అత్యంత భారీ పెట్టుబడి...
X
మోడీతో భేటీ తర్వాత వెల్లడించిన సత్యా నాదెళ్ల..

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో అత్యంత భారీ పెట్టుబడికి సిద్ధమైంది. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏకంగా రూ.1.5 లక్షల కోట్లు (17.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సమావేశమైన అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది.

ఆసియాలోనే మైక్రోసాఫ్ట్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదేనని సత్య నాదెళ్ల తెలిపారు. రానున్న నాలుగేళ్లలో (2026-2029) ఈ నిధులను వెచ్చించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ పెట్టుబడి ద్వారా భారత్‌లో ఏఐకి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల అభివృద్ధి, సామర్థ్యాల పెంపునకు కృషి చేస్తామని ఆయన వివరించారు. ఈ సమావేశంపై సత్య నాదెళ్ల ఎక్స్ వేదికగా స్పందిస్తూ, "భారత్ ఏఐ అవకాశాలపై ప్రధాని మోదీతో స్ఫూర్తిదాయకమైన చర్చ జరిగింది. దేశ ఆశయాలకు మద్దతుగా ఈ పెట్టుబడి పెడుతున్నాం" అని పేర్కొన్నారు.

ఈ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. "ఏఐ విషయంలో ప్రపంచం భారత్ వైపు ఆశాభావంతో చూస్తోంది. సత్య నాదెళ్లతో ఫలవంతమైన చర్చ జరిగింది. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడికి భారత్‌ను ఎంచుకోవడం సంతోషకరం" అని మోదీ తన పోస్ట్‌లో తెలిపారు. దేశ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఏఐ శక్తిని సృజనాత్మకంగా వినియోగించుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

ఇప్పటికే భారత్‌లో హైదరాబాద్, పుణే వంటి నగరాల్లో బలమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్ తాజా పెట్టుబడి... దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, స్టార్టప్‌లకు భారీ ఊతమిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags

Next Story