Electoral Bonds: ఎన్నికల బాండ్ల డేటా విడుదల ..

Electoral Bonds: ఎన్నికల బాండ్ల డేటా విడుదల ..
ఐదేండ్లలో 22,217 ఎన్నికల బాండ్లు.. అత్యధిక విరాళాలు బీజేపీకే

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు SBI సమర్పించిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో మొత్తం విరాళాలు 11 వేల 671 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా భాజపాకు 6 వేల 61 కోట్లు, తృణమూల్‌కు 16 వందల 10 కోట్లు... కాంగ్రెస్‌కు 14 వందల 22 కోట్లు వచ్చాయి. బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిత్తల్‌ నుంచి బిలియనీర్‌ సునీల్‌ భారతీ మిత్తల్, అనిల్‌ అగర్వాల్, ఐటీసీ, మహీంద్ర అండ్‌ మహీంద్ర కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అంతగా పేరులేని ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ కంపెనీలున్నాయి.

చాలా పార్టీలకు ఆయా పార్టీల పేరుపై ఎన్నికల బాండ్ల విరాళాలు రాగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు మాత్రం అధ్యక్షుల పేర్లపై వచ్చాయి. 2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీ అత్యధికంగా 13 వందల 68 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ముంబయికి చెందిన క్విక్‌ సప్లై చైన్‌ సంస్థ 410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. వేదాంత సంస్థ 400 కోట్ల బాండ్లను కొనుగోలు చేయగా... హల్దియా ఎనర్జీ సంస్థ 377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. గాజియాబాద్‌ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ 162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. లక్ష్మీ మిత్తల్‌ తన సొంత డబ్బు 35 కోట్లతో బాండ్లు కొనగా..ఆయన కంపెనీలు మరో 247 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి. కిరణ్‌ మజుందార్‌ షా, వరుణ్‌ గుప్తా, బీకే గోయెంకా, జైనేంద్ర షా, మోనికా వ్యక్తిగతంగా బాండ్లు కొన్నారు. భాజపాకు 6,566 కోట్ల విలువైన బాండ్లు, కాంగ్రెస్‌కు 11 వందల 23 కోట్ల విలువైన బాండ్లు, తృణమూల్‌కు వెయ్యి 92 కోట్ల బాండ్లు దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ రాజకీయ పార్టీలకు 966 కోట్ల విరాళం ఇచ్చింది. షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి 40 కోట్ల విరాళం ఇచ్చింది. ఎన్నికల బాండ్ల రూపంలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక విరాళాలు అందిన పార్టీల్లో వైకాపా అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీకి ఇప్పటిదాకా 337 కోట్లు అందగా... తెలుగుదేశానికి 219 కోట్లు, జనసేనకు రూ.21 కోట్లు వచ్చాయి. తెలంగాణలో భారాసకు 12 వందల 15 కోట్ల విరాళాలు అందాయి. మరోవైపు ఎన్నికల బాండ్లపై నేడు ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

Tags

Read MoreRead Less
Next Story