NDA: ఎన్డీఏ గూటికి ఓం ప్రకాశ్ రాజ్‌భర్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే దిశగా బీజేపీ(BJP) పావులు కదుపుతోంది. సార్వత్రిక ఎన్నికలే( Lok Sabha elections) లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్న వేళ భారతీయ జనతా పార్టీ(BJP) కూడా ఎన్డీయేను బలోపేతం చేయటంపై దృష్టి సారించింది. పాతమిత్రులను తిరిగి ఎన్డీయే(NDA) గూటికి తెచ్చేందుకు కొన్నిరోజుల నుంచి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ లో ఓబీసీల్లో గట్టి పట్టున్న నేతగా గుర్తింపు పొందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) అధినేత ఓంప్రకాశ్ రాజ్ భర్( Om Prakash Rajbhar) తిరిగి నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (NDA) గూటికి చేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్(twitter) లో పోస్టుచేశారు. 2024సార్వత్రిక ఎన్నికల్లో భాజపాతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈనెల 18న జరిగే ఎన్డీయే సమావేశానికి హాజరుకానున్నట్లు రాజ్ భర్ తెలిపారు. 2022 ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నంచి రాజ్ భర్ వైదొలిగారు. సమాజ్ వాదీ పార్టీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈనెల 18న నిర్వహించే ఎన్డీయే సమావేశంలో పాల్గొనాలని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల లేఖలు రాశారు.
ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరగనున్న నేపథ్యంలో పాత మిత్రులను కలుపుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ సమావేశానికి ఆహ్వానిస్తూ పలు పార్టీలకు లేఖలు వెళ్తున్నాయి. లోక్‌జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా లేఖ రాశారు. ఎన్డీయే సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు.డ్డా లేఖపై చిరాగ్ స్పందిస్తూ.. తమ పార్టీ నేతలతో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము పలు అంశాల్లో బీజేపీకి మద్దతిస్తూనే ఉన్నామని ఆయన గుర్తు చేశారు.
బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంజీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా ఎన్డీయే సమావేశానికి హాజరవ్వబోతున్నట్లు తెలిపింది. మాంజీ కుమారుడు సంతోష్ కుమార్ ఈ మేరకు ప్రకటన చేశారు. నడ్డా నుంచి తమకు ఆహ్వానం అందిందన్నారు. మహారాష్ట్ర సీఎం శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం, బిహార్, యూపీ నుంచి పలు చిన్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ నెల 18న ఢిల్లీలో జరిగే ఎన్డీయే భేటీకి హాజరుకానున్నాయి. ప్రధాని మోదీ కూడా ఇందులో పాల్గొననున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com