Supreme Court: పురుషుల జాతీయ కమిషన్... సుప్రీం నో

దేశంలో పురుషుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పెళ్లైన మగవాళ్లలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయని... గృహ హింసే దీనికి కారణమని లాయర్ మహేశ్ కుమార్ తివారీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. పెళ్లైన మగవాళ్లలో ఎక్కువ బలవన్మరణాలకు గృహ హింసే ప్రధాన కారణమని పిటిషనర్ చేసిన వాదనను పరిగణనలోనికి తీసుకునేందుకు బెంచ్ నిరాకరించింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా సభ్యులుగా ఉన్న ద్వి సభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు నాణేనికి ఒకవైపు ఉన్న అంశాలనే చూపించాలనుకుంటున్నారా అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోరని.. వాస్తవాలపై ఇది ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది.
జాతీయ నేర గణాంక నివేదిక 2021 ప్రకారం ఆ ఏడాది దేశం మొత్తం మీద 1,64,033 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో పురుషులు 1,18,979 కాగా మహిళలు 45,026 మంది, మరో 28 మంది ఇతరులు ఉన్నారు. బలవన్మరణాలకు పాల్పడిన 1,18,979 మంది మగవాళ్లలో పెళ్లైనవారు 81,068 మంది ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన 45,026 మంది మహిళల్లో వివాహితులు 28,680 మంది ఉన్నారు. పెళ్లైన మగవాళ్లలో...33.2శాతం మంది ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు కారణంగా కాగా, 4.8శాతం మంది మృతికి వివాహ సంబంధిత వివాదాలు కారణమని పిటిషనర్ మహేశ్ కుమార్ తివారీ వాదించారు.
ఈ నేపథ్యంలో పెళ్లైన మగవాళ్లలో ఆత్మహత్యలను నివారించడానికి గాను...గృహ హింసపై పురుషులు ఇచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకునేలా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆదేశాలివ్వాలని పిటిషనర్ మహేశ్ కుమార్ తివారీ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. వివాహం, కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడే పురుషులకు సంబంధించి తగు అధ్యయనం నిర్వహించి నివేదిక అందించేందుకు లా కమిషన్‌ను ఆదేశించాలని కోరారు. ఆ నివేదిక ఆధారంగా పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేసినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం వీటిని పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించే వరకూ గృహహింస, కుటుంబ సమస్యలపై పురుషులు ఇచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకునేలా పోలీసులను ఆదేశించాలని.. దీనికోసం రాష్ట్రాల్లోని మానవ హక్కుల కమిషన్లకు కూడా తగు ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ కోరినా సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com