Supreme court: బాలికలు కోరికలు అంటూ కలకత్తా హైకోర్టు తీర్పు కొట్టేసిన సుప్రీం కోర్ట్
కౌమార బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలని సూచిస్తూ కలకత్తా హైకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఆ కేసులో నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.
ఒక లైంగిక దాడి కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించడంతోపాటు కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ వ్యాఖ్యలు చేసిన కలకత్తా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది. ఇవి దిగ్భ్రాంతికరమని, గర్హనీయమని జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆక్షేపించింది. ఆ కేసులో నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టంచేసింది. అయితే, బాధితురాలు.. నిందితుడిని పెళ్లి చేసుకొని, మైనర్ కుమార్తెతో కలిసి అతడితో జీవిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి, బాధితురాలితో చర్చించాలని సూచించింది. ఆ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా శిక్షపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. పోక్సో చట్టం కింద కేసుల దర్యాప్తు విషయంలో అధికారులకు పలు మార్గదర్శకాలు జారీచేస్తున్నట్లు పేర్కొంది. అలాగే న్యాయస్థానాలు తీర్పులను ఎలా రాయాలన్నదానిపై కూడా ఆదేశాలిస్తున్నట్లు తెలిపింది.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తికి ట్రయల్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ అతడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. గతేడాది అక్టోబరు 18న సంచలన తీర్పు వెలువరించింది. బాలిక అతడితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఆ సందర్భంగా న్యాయస్థానం కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘‘కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే.. సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారు. కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి’’ అని సూచించింది. దీనిపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటో రిట్ పిటిషన్‌గా స్వీకరించింది. మరోవైపు, నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అత్యున్నత న్యాయస్థానంలో అపీలు దాఖలు చేసింది. వీటిపై గతంలో విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు సూచనలపై అసహనం వ్యక్తంచేసింది. తాజాగా ఇచ్చిన తీర్పులోనూ వాటిని గర్హించింది. న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు బోధించరాదని, వ్యక్తిగత అభిప్రాయాలను చొప్పించరాదని పేర్కొంది. కోర్టులు చట్టాన్ని అనుసరించాలని, దాన్ని అమలు చేయాలని స్పష్టంచేసింది. చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు నడుచుకోజాలవని తెలిపింది. ‘‘క్లుప్తతే నాణ్యమైన తీర్పులకు గీటురాయి. అవి సరళమైన భాషలో ఉండాలి. పదాడంబరత ఉండకూడదు. వాటిని సాహితీ రచనలుగా భావించకూడదు. కేసులోని ప్రతి అంశాన్నీ ఉదహరిస్తూ పేజీలు వృథా చేయకూడదు’’ అని తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com