Customs Duty :కస్టమ్స్ డ్యూటీ పేరుతో మోసం

ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇండియన్ కస్టమ్స్ పేరుతో ఫోన్లు చేసి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ తరహా మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీనికి సంబంధించి ‘మాట్రిమోనియల్ డేటింగ్ స్కామ్’ పేరిట ఓ పోస్టర్‌ను తన ట్విటర్ అకౌంట్ లో షేర్ చేసింది. కస్టమ్స్ సుంకం చెల్లింపుల కోసం ఇండియన్ కస్టమ్స్ విభాగం ఎప్పుడూ ఫోన్ కాల్/ ఎస్సెమ్మెస్ పంపదని స్పష్టం చేసింది. సైబర్ నేరాలు చేసేవారు రోజుకో కొత్త స్కామ్‌తో అమాయకులను దోచేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు, ఆన్‌లైన్ మోసాలపై వినియోగదారులకు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.ఫేక్ కాల్స్, ఫేక్ ఎస్సెమ్మెస్ స్కామ్‌లు, నకిలీ కస్టమర్‌కేర్ నంబర్లు, upi ఐడి వంటి వాటితో కస్టమర్ల డబ్బులు కొట్టేసే నేరగాళ్లు ఇప్పుడు కొత్త తరహా మోసాలు మొదలు పెట్టారు.
ఏదో ఒక లాటరీలో గెలిచారని, అందులో భాగంగా విదేశాల నుంచి ఖరీదైన బహుమతి వచ్చిందని, కానీ దాని కస్టమ్ క్లియరెన్స్ కోసం కొంత నగదు తమ బ్యాంకు అకౌంట్ కి బదిలీ చేయాలని ఇండియన్ కస్టమ్స్ పేరుతో ఫోన్ చేస్తారు. ఇలాంటి విషయంలోనే అప్రమత్తంగా ఉండాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కస్టమ్స్ డ్యూటీ డబ్బును వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయమని ఇండియన్ కస్టమ్స్ ఎప్పుడూ కోరదని, అలాగే, కస్టమ్స్ డ్యూటీ కోసం ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్ ద్వారా సంప్రదింపులు జరపదని తెలిపింది. ఇటువంటి విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) వెబ్‌సైట్‌లో వెరిఫై చేసిన డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (DIN) ద్వారానే గుర్తించాలని చెప్పింది.
ఇండియన్ కస్టమ్స్ నుంచి వచ్చే అన్ని రకాల సంప్రదింపులకు జత చేసిన డాక్యుమెంట్ ఐడెండిఫికేషన్ నంబరు(డీఐఎన్)ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని కోరింది . చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ ఇండియన్ కస్టమ్స్ పేరుతో ఏదైనా డాక్యుమెంట్ లేదా ఈ-మెయిల్ వస్తే అందులో డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ నంబర్ ఉందా? లేదా అన్న విషయాన్ని ? ముందుగా చెక్ చేయాలని సూచించింది. అక్కడితో వదిలేయకుండా లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com