Manipur Violence: మణిపూర్‌లో నేటి నుంచి స్కూల్స్, కాలేజీలు రీఓపెన్

జాతుల మధ్య వైరంతో తగలబడిపోతున్న మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో భారీగా సైనికులను మోహరించింది. అయితే, హింసాత్మాక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీల్లో నేటి (నవంబర్ 29) నుంచి రెగ్యులర్ తరగతులు పునఃప్రారంభించబోతున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ప్రభుత్వ- ఎయిడెడ్ కళాశాలలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఈరోజు నుంచి తిరిగి తెరవబడతాయని ఉన్నత- సాంకేతిక విద్యా శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.
కాగా, జిరిబామ్ జిల్లాల్లో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీసిన తర్వాత నవంబర్ 16న మణిపూర్‌లోని వివిధ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో ఆరు జిల్లాల జిల్లా మేజిస్ట్రేట్‌లు కర్ఫ్యూ విధించారు. అయితే, నేటి నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైతుండటంతో.. అధికారులు కర్ఫ్యూను సడలించారు. ఇక, హింసాత్మక ఘటనల కారణంగా ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్, జిరిబామ్, ఫెర్జాల్‌లతో సహా తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను మరో రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com