Karnataka: కర్ణాటకలో పులిగోర్ల కలకలం

Karnataka: కర్ణాటకలో పులిగోర్ల కలకలం
రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు

కర్ణాటకలో పులిగోర్ల కలకలం రేగుతోంది. పులి గోరు ధరించినందుకు కన్నడ రియాలిటీ షో కంటెస్ట్‌ వర్తుర్‌ సంతోష్‌ను ఆదివారం సెట్‌లో నుంచే అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంతోష్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించారు. అయితే ఈ అరెస్టు తరువాత రాష్ట్రంలో అనేక మంది ప్రముఖల దగ్గర ఇలాంటి పులిగోర్లు ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి.

ఇక వర్తుర్ సంతోష్‌ను బిగ్‌బాస్ హౌస్ నుంచి అరెస్టు చేశాక.. ఎంపీ జగ్గేశ్ రెండు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఓ ఇంటర్యూ ఇప్పుడు బయటపడింది.అయితే ఇందులో జగ్గేశ్ పులిగోరు ధరించి కనిపించారు. అంతేకాదు తన 20వ పుట్టినరోజు సందర్భంగా తన తల్లి బహుమతిగా ఇచ్చిందని చెప్పారు. తాను పులిలా పెరగాలనే ఉద్ధేశంతో ఈ పులిగోరు ఇచ్చారని ఆ ఇంటర్యూలో చెప్పారు జగ్గేశ్. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటీజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పటి దాకా ఎంపీ జగ్గేశ్ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. మరోవైపు జేడీఎస్ నేత నిఖిల్ కుమారస్వామి.. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. తన ధరించింది నకిలీ పులిగోరు అంటూ వివరణ ఇచ్చారు. తన పెళ్లికి ఎవరో గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాదు కావాలంటే అధికారులు తనిఖీ చేసుకొవచ్చని కూడా చెప్పారు.


అయితే సోషల్‌మీడియాలో వస్తున్న వీడియోలు, ఫొటోలపై ఇప్పటికే అటవీ అధికారులు రంగంలోకి దిగారు. కన్నడ నటుడు దర్శన్‌ ఇంట్లో అటవీ అధికారులు సోదాలు చేశారు. అలాగే మరికొందరి సెలబ్రిటీల ఇళ్లలో కూడా సోదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

కాగా, ఈ ఆరోపణలపై కర్ణాటక అటవీ శాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల బృందం వివిధ ప్రాంతాల్లో విచారణ నిర్వహిస్తుంది. అలాంటి వస్తువులు ఉన్నట్లు వెల్లడయితే వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కర్ణాటక పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే మాట్లాడుతూ చట్టం ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ వర్తిస్తుందని, ప్రభుత్వం చట్టం ప్రకారం నడుస్తుందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story