Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు..

Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు..
X
బీహార్‌లో బీజేపీ, జేడీయూలు చెరి 101 స్థానాల్లో పోటీ

బీహార్‌ శాసన సభ ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం నియోజకవర్గాలు 243 కాగా, బీజేపీ, జేడీయూ చెరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ (ఆర్‌) 29 స్థానాల్లో, ఆర్‌ఎల్‌ఎం, హెచ్‌ఏఎం (ఎస్‌) చెరి ఆరు స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. బీహార్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ వివరాలను ఆదివారం ప్రకటించారు. సీట్ల కేటాయింపు ఫార్ములాను ఎన్డీయే పక్షాల నేతలు, కార్యకర్తలు స్వాగతించినట్లు తెలిపారు.

నేతల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయన్నారు. బీహార్‌ సిద్ధంగా ఉందని, మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటువుతుందని ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు. ఇదిలా ఉండగా, ఎన్డీయే కూటమిలో పార్టీల బలాలు మారినట్లు కనిపిస్తున్నది. ఈసారి బీజేపీతో సమాన స్థానాల్లో జేడీయూ పోటీ చేస్తుండటమే దీనికి సంకేతం. బీజేపీ కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకపోవడం జేడీయూకు ఇదే మొదటిసారి.

తక్కువగా చూస్తున్నారు.. పర్యావసానాలుంటాయి

సీట్ల పంపకంపై హెచ్‌ఏఎం (ఎస్‌) చీఫ్‌, కేంద్ర మంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీ సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, తమ పార్టీని తక్కువగా చూస్తున్నారని, దీని పర్యవసానాలు ఎన్డీయే పక్షాలపై ఉంటాయని హెచ్చరించారు. ఆయన మొదట్లో 15 స్థానాలను డిమాండ్‌ చేశారు. కానీ ఆరు స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగారు.

ఇండియా బ్లాక్‌లో విభేదాలు లేవు!

ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ పక్షాల మధ్య సీట్ల పంపకం విషయంలో పొరపొచ్చాలు లేవని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్‌ వీరేంద్ర చెప్పారు. “అంతా బాగుంది. అంతా పూర్తయింది. సోమవారం మీడియా సమావేశం ఉంటుంది. అన్ని విషయాలు వెల్లడవుతాయి” అన్నారు.

Next Story