Bihar Assembly Elections 2025: బిహార్‌లో 122 నియోజక వర్గాలకు రేపు పోలింగ్ ..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ ఎన్నికల ప్రచార ఘట్టం ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ దశ పోలింగ్ మంగళవారం జరగనుండగా శుక్రవారం ఫలితాలు వెలువడనున్నాయి. 20 జిల్లాల వ్యాప్తంగా 122 నియోజకవర్గాలలో ఓటింగ్ జరగనున్నది. రెండవ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 136 మంది(దాదాపు 10 శాతం) మహిళలు ఉండగా 45,399 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరగనున్నది. రెండవ దశలో పోలింగ్ జరగనున్న 122 స్థానాలు బీహార్‌లోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ దశ కోసం మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 గ్రామీణ, 5,326 పట్టణ బూత్‌లు ఉన్నాయి. నవంబర్ 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బీహార్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243. నవంబర్ 14 న ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాలు ప్రకటించనున్నారు.
బీజేపీకి సంప్రదాయకంగా తిర్హుత్, సారణ్, ఉత్తర మిథిలాంచల్ ప్రాంతాలలో గట్టి పట్టు ఉంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకు భాగల్‌పూర్ ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది. ఇక విపక్ష మహాఘట్‌బంధన్‌కు మగధ్ ప్రాంతంలో బలమైన పునాది ఉంది. ఈ ప్రాంతం పరిధిలో గయ, ఔరంగాబాద్, నావడ, జెహనాబాద్, అర్వాల్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏమాత్రం పలుకుబడి లేని కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాల బలంపైనే ఆధారపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

