IIT Delhi Fest: విద్యార్థినుల వాష్‌రూంలో సీక్రెట్ కెమెరాలు

ఐఐటీ-ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫెస్ట్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల వాష్ రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసినట్టు కొంతమంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఫెస్ట్‌లో భాగంగా ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన భారతి కళాశాల విద్యార్థినులు దుస్తులు మార్చుకునేందుకు వినియోగించిన వాష్‌రూంలో రహస్య కెమెరాలతో చిత్రీకరణ జరిగింది. ఈ మేరకు వారు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనాక్రమాన్ని వివరిస్తూ బాధితులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై తాము ఫిర్యాదు చేసినా ఐఐటీ-ఢిల్లీ యాజమాన్యం పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ కాంట్రాక్ట్ స్వీపర్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఈ ఘటనపై కిషన్ గఢ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై దర్యాప్తు మొదలుపెట్టి 20 ఏళ్ల కాంట్రాక్ట్ స్వీపర్ అయిన నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఐపీసీ సెక్షన్ 354సీ కింద కేసు నమోదు చేసుకొని, నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.
అయితే దీనిపై ఐఐటీ ఢిల్లీ స్పందించింది. ఇలాంటి ఘటనను సహించేది లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. పరిస్థితిని అధికారులకు నివేదించామని పేర్కొంది. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని తెలిపింది. కాగా.. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఈ ఘటనను ఖండించింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com